పంచాయతీ పద్దులకు ఏకగ్రీవ ఆమోదం

– సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానాలు

– బీజేపీ, బీఆర్ఎస్‌లకు చురకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: రాష్ట్ర శాసనసభలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల బడ్జెట్ పద్దులు విస్తృత చర్చ అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, అమలు విధానం, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. అంతకుముందు ఆయా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడారు. మన దేశపు ప్రాణం పల్లెలు.. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పారు. ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అన్న మహాత్ముని మాటలు మనకు స్ఫూర్తిదాయకాలని, గ్రామాభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందంజలో నిలిచిందని అన్నారు. గ్రామ పంచాయతీలకు బలం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీయేనని, స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ హామీ ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని చెప్పారు. 73వ రాజ్యాంగ సవరణ (1992) ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత తీసుకొచ్చిందన్నారు. ఇది గ్రామాలకు అధికారాన్ని, ప్రజలకు స్వయం నిర్ణయాధికారాన్ని అందించిందని తెలిపారు. ప్రజల చేతుల్లోనే అధికారాన్ని పెట్టడమే నిజమైన ప్రజాస్వామ్యం.. ఈ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ కార్యరూపంలోకి తీసుకొచ్చిందని, గ్రామాల అభివృద్ధి కోసం పలు కీలక కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి భద్రత కల్పిస్తూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, రోడ్లు, నీటి వనరుల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. మహిళా సాధికారతలో కూడా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. పంచాయతీలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి గ్రామ పాలనలో మహిళల పాత్రను పెంచిందని, సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పంచాయతీలలో ప్రాతినిధ్యం కల్పించిందని తెలిపారు. గ్రామస్థాయిలో సమానావకాశాలు కల్పించే విధానాలను అమలు చేసిందన్నారు. రాజీవ్ గాంధీ మాటలు తమకు స్ఫూర్తి అని, గ్రామీణాభివృద్ధిని కేవలం మౌలిక వసతులకే పరిమితం చేయకుండా ప్రజల సాధికారత వైపు కాంగ్రెస్ దృష్టి పెట్టిందన్నారు. బలమైన పల్లెలు బలమైన జాతిని నిర్మిస్తాయన్న నమ్మకంతో గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేసిందని, ఇంకా చేస్తూనే ఉంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

సభ్యుల ప్రశ్నలకు సవివరంగా సమాధానం

చర్చలో సంబంధిత శాఖలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు దాదాపు గంటన్నరపాటు ఓపికగా, వివరణాత్మకంగా మంత్రి సీతక్క సమాధానాలు ఇచ్చారు. ప్రతి అంశాన్ని స్పష్టంగా వివరించి సందేహాలను నివృత్తి చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

వాస్తవాలు, ఆధారాలతో విపక్షాలకు కౌంటర్

విపక్షాలు లేవనెత్తిన ఆరోపణలకు మంత్రి సీతక్క తగిన ఆధారాలతో సమాధానం ఇస్తూ గత ప్రభుత్వాల వైఫల్యాలను సభ దష్టికి తెచ్చారు. తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చు చేసిన నిధుల వివరాలను గణాంకాలతో వివరించారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీటి సరఫరా విస్తరణ, మహిళా-శిశు సంక్షేమ కార్యక్రమాల్లో సాధించిన పురోగతిని సభ ముందుంచారు. మొత్తంగా అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల బలోపేతం, మహిళల సంక్షేమం, శిశు సంరక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

బీజేపీ సభ్యులకు మంత్రి సీతక్క చురకలు

పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మంత్రి సీతక్క బీజేపీ సభ్యులనుద్దేశించి విమర్శించారు. అసెంబ్లీలో ఎనిమిదిమంది అష్ట దిగ్బంధ పాలకులు (బీజేపీ) ఉన్నారని, వారు కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ వాకౌట్‌పై సీతక్క ఫైర్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలను అభివృద్ధి చేయలేదు.. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము ఎక్కడా ఆపలేదు. జరిగిన పనులను మరింత ముందుకు తీసుకెళ్తాము. ఇప్పటికీ చాలా గ్రామాల్లో నీటి వసతి వసతి లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మీయ భరోసా అందరికీ అందడంలేదు.. సమస్యలు ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లెటర్ ఇవ్వండి.. మాట్లాడితే వాకౌట్ చేయడం సరైన విధానం కాదు. స్వీపింగ్ రిమార్క్ చేసి వాకౌట్ పేరుతో డ్రామాలు ఆడుతోంది.. పరిపాలనలో ఏదైనా ఇబ్బంది ఉంటే సెట్ చేసుకుంటాం.. సునీతా లక్ష్మారెడ్డి అసత్యాలు మాట్లాడరు అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *