– రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మీదే
– బీఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: తెలంగాణ అసెంబ్లీలో బ్జడెట్ చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఖజానా సరిపోతోందని ధ్వజమెత్తారు. పాండవులు సంపాదించింది కౌరవుల తద్దినానికే సరిపోయినట్లు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే మాకు సరిపోతోందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు తన నియోజకవర్గంలోనే రైతులకు అప్పులు ఉన్నాయని చెబుతున్నారని, మరి ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉండి కూడా పదేళ్లలో ఎందుకు రుణ మాఫీ చేయలేకపోయారని సీతక్క ప్రశ్నించారు. ఏకకాలంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం రైతులను వంచించిందని, ఇప్పుడు ఆరు నెలల తమ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమమే నిధులు, నియామకాల కోసం జరిగిందని గుర్తు చేసిన సీతక్క బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ గ్యారెంటీ ఇచ్చిందని నిలదీశారు. కేవలం నోటిఫికేషన్లు ఇస్తే సరిపోదని, తాము అధికారంలోకి రాగానే వేల సంఖ్యలో నియామక పత్రాలు అందజేసి పేద కుటుంబాల్లో వెలుగులు నింపామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, నూతనంగా ప్రకటించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాలను చూసి బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్క చెప్పండి.. మేము ఈ రెండేళ్లలో ఎన్ని ఇచ్చామో చూపిస్తాం అని సవాలు విసిరారు. హరీష్ రావు పడుతున్న బాధ అంతా అధికారం పోయిందనే తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని సీతక్క వ్యాఖ్యానించారు. సీటు మారగానే చరిత్ర మారిపోదని, పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేయని పనుల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ప్రజల కోసం తాము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆమె సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.