- ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ
- మంత్రి తమ్మలతో యూఎఫ్ ప్రతినిధుల సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ఫ్లోరిడా విశ్వవిద్యాలయం(Florida University) సహజ వనరులు, పర్యావరణ పాఠశాల డైరెక్టర్ డా. కె.రమేష్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధన, విస్తరణ, విద్యా రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం తరఫున ప్రతిపాదించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం కలిసి తెలంగాణ డిజిటల్, సుస్థిర వ్యవసాయ వ్యవస్థల కేంద్రం (టీడీఎసఏసీ) స్థాపనపై కూడా చర్చించారు. ఈ భాగస్వామ్యం ద్వారా డిజిటల్, ఖచ్చిత వ్యవసాయం, ఏఐ ఆధారిత వ్యవస్థలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణమైన పంటలు అభివృద్ధి, నేల ఆరోగ్య సంరక్షణ, నీటి వినియోగ సమర్థత పెంపు వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రత్యేకంగా తెలంగాణలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి అధిక విలువ పంటల సాగు, వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీలు, పరిశ్రమల స్థాపన ద్వారా రైతులకు అధిక ఆదాయం అందించే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి రైతులకు మార్కెట్ అవకాశాలను విస్తరించే దిశగా కలిసి పనిచేయొచ్చని ప్రతినిధులు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయం పెంచడం దిశగా ఇలాంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మాజీ ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఎస్.రఘువర్ధన్ రెడ్డి, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.





