– ప్రజలను మోసగిస్తున్న సీపీఎం, బీజేపీలు
– మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : కేరళంలో ఈసారి రాజకీయ మార్పు అనివార్యమని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. యుడిఎఫ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేరళంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అలెప్పి నియోజకవర్గం మన్నన్‌చెరీ పంచాయితీలోని కవుంకల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గారితో కలిపి పర్యటించిన మంత్రి పొంగులేటి స్థానిక అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆయనకు మార్పు పట్ల ఉన్న ఆకాంక్ష స్పష్టంగా కనిపించిందన్నారు. కేరళంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తే తెలంగాణలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ మోడల్‌ను అక్కడ కూడా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం తెలంగాణలో అమలు చేస్తున్నట్లే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కేరళంలో కూడా ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రస్తుతం కేరళంలో ఉన్న సిపిఎం ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, బీజేపీని కౌంటర్ చేయడం పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతోందని మంత్రి విమర్శించారు.ఈ రెండు పార్టీలు కలిసి ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లిస్తున్నాయని ఆయన అన్నారు.ఉద్యోగాల కొరత, ధరల పెరుగుదల, వంటి ప్రధాన సమస్యలను పక్కనబెట్టి, రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.కేరళ ప్రజలు ఇప్పటికే సిపిఎం ప్రభుత్వంపై విసుగుచెందారని, ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. “ప్రజలకు పారదర్శకత, అభివృద్ధి, సంక్షేమం అందించగల శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది. కేరళంలో యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కేరళలో ఈసారి ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పుకే కాకుండా, ప్రజల భవిష్యత్తు మార్పుకు దారితీసే ఎన్నికలుగా నిలుస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





