– నియమించిన డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: పోలీస్ భద్రత, ఆరోగ్య భద్రత విభాగం నూతన కార్యదర్శిగా రిటైర్డ్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, భద్రత విభాగం మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బి.శివధర్ రెడ్డి నియమించారు. డిజిపి కార్యాలయంలో భద్రత, ఆరోగ్య భద్రత మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, డిజిపి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవికి వచ్చిన పలు ప్రతిపాదనలను పరిశీలించి కమిటీ చైర్మన్ గా ఉదయ్ కుమార్ రెడ్డి నియామకానికి ఆమోదం తెలిపారు. ఉదయ్ కుమార్ గతంలో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. 20 ఏళ్లుగా భద్రత, ఆరోగ్య భద్రత కార్యదర్శిగా పనిచేసిన ఎ.గోపాల్ రెడ్డి అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. సమావేశం ప్రారంభంలో ఆయన మృతికి సంతాప సూచకంగా అధికారులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అంకితభావంతో ఆయన చేసిన సేవలను డిజిపి ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం విభాగం బలోపేతం, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం.భగవత్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్, టీజీఎస్పీ అడిషనల్ డిజిపి సంజయ్ కుమార్ జైన్, పి అండ్ ఎల్ ఐజిపి గజరావు భూపాల్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఐజీ ఎం.రమణ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు వై.గోపిరెడ్డి, లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




