– ‘విజన్’ డాక్యుమెంట్‌కు అనుగుణంగా క్వాంటం రోడ్డు మ్యాప్
– రాష్ట్ర, దేశ అభివృద్ధికి క్వాంటం టెక్నాలజీ కీలకం
– రోడ్డు మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ
– క్వాంటం స్టార్టప్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: భవిష్యత్తు క్వాంటం ఎకానమీ లీడర్‌గా హైదరాబాద్ నిలుస్తుందని, ఇందుకవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యం వంటి అన్ని వనరులు హైదరాబాదులో దండిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ‘తెలంగాణ రైజింగ్ 2047’ను తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర దృక్కోణానికి అనుగుణంగా రూపొందించినదని అభివర్ణించారు. త్రిబుల్ ఐటీ గచ్చిబౌలిలో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం- తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ (టీక్యూఎస్) ఆవిష్కరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు. 1980వ దశకంలోనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపిస్తుందని తాము హెచ్‌సీయూ విద్యార్థులుగా చర్చించుకున్న విషయాన్ని సభలో డిప్యూటీ సీఎం పంచుకున్నారు. క్వాంటం టెక్నాలజీ ప్రపంచాన్ని ఇతర సాంకేతికతల కంటే వేగంగా అన్ని రంగాల్లోనూ మార్పు తీసుకురానుందని చెప్పారు. గొప్ప భవిష్యత్తు కోరుకునే ఏ దేశానికైనా క్వాంటం వ్యూహం అవసరం అన్నారు. దేశాల భవిష్యత్తు, వాటి జాతీయ భద్రత, ఆర్థిక పరిమాణం, అభివృద్ధి.. అన్నింటినీ ఇది పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుందని తెలిపారు. జాతీయ మిషన్‌కు అనుసంధానంగా రూపొందించిన టీక్యూఎస్ పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఏకీకృత, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తుందని ఆయన తెలిపారు.
టీక్యూఎస్ ప్రారంభంతోపాటు దేశంలో అత్యంత ఆధునిక క్వాంటం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలన్న రాష్ట్ర సంకల్పాన్ని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి ప్రకటిస్తున్నామన్నారు. బలమైన, లోతైన పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్యాలను తాము ప్రోత్సహించబోతున్నామన్నారు. క్వాంటం టెక్నాలజీ తెలంగాణతోపాటు భారత ఆర్థిక వృద్ధికి కీలకాధారం కానుంది అని భట్టి వివరించారు. ఇది అన్ని రంగాల్లో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి సహాయపడుతుందని, తమ పరిశోధన, ఆవిష్కరణ ప్రణాళికలకు ఇది అత్యంత కీలకం అని తెలిపారు. స్టార్టప్‌ల లక్ష్యాలను చేరుకోవడంలో కూడా క్వాంటం ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ రోజు తాము యువ భారత్ స్టార్టప్ ఫండ్‌ను రూ.1,000 కోట్లతో స్థాపిస్తున్నామని ప్రత్యేకంగా చెప్పాలని, క్వాంటం స్టార్టప్‌లు తమ ప్రధాన దృష్టి అని ఉద్ఘాటించారు. ప్రయోగశాలల్లోని పరిశోధన నుంచి మార్కెట్లోని వ్యాపార, అనుబంధ విభాగాల వరకు పూర్తి క్వాంటం విలువ శృంఖల (వాల్యూ చెయిన్)ను ఎలా నిర్మించాలనే దానికి తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారడానికి తాము కృషి చేస్తావని భరోసా ఇచ్చారు. క్వాంటం కేవలం వ్యాపారం లేదా ఆర్థికాభివృద్ధికే కాదు, కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల పెంపునకు కూడా కీలకం కానుందన్నారు. తెలంగాణ విస్తృతమైన శాస్త్రీయ, విధాన దృక్పథం, కార్యసాధన శక్తి ఈ మూడిరటినీ కలిపి, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమ, ప్రభుత్వం భాగస్వాములుగా పనిచేసే బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తుందని చెప్పారు. మన దేశం ఒక గొప్ప ‘క్వాంటం లీప్’ తీసుకుంటున్న ఈ రోజును మనమందరం కలిసి జరుపుకుందామన్నారు. సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం, సభ్యులు డాక్టర్ వి.కె.సారస్వత్, దేబ్జాని ఘోష్, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఐఐఐటి-హైదరాబాద్, ఐఐటీ-హైదరాబాద్, సి.ఆర్.రావు ఇన్‌స్టిట్యూట్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





