– ఒకరు సంగారెడ్డిలో, మరొకరు బీదర్ వద్ద
– ఉరితాళ్లుగా చైనా మాంజా
– మెడకు కోసుకుపోవడమే కారణం
– మృతుల కుటుంబాల్లో విషాదం
సంగారెడ్డి/బెంగళూరు, ప్రజాతంత్ర, జనవరి14: రెండు వేర్వేరు సంఘటనల్లో చైనా మాంజా మెడకు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ పరిణామాలతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. సంగారెడ్డి మండలం పసల్వాడి గ్రామంలో భయానక ఘటన చోటుచేసుకుంది. చైనా మాంజా మెడకు తగిలి గొంతు కోసుకుపోవడంతో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని బిహార్ కి చెందిన అద్వైక్‌గా గుర్తించారు పోలీసులు. కొంతకాలంగా అతడు పసల్వాడిలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం అతను బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా రోడ్డుకు అడ్డంగా వెళాడుతోంది. అది కంటికి కనిపించకపోవడంతో ఒక్కసారిగా అతని గొంతుకు చుట్టుకుని కోసేసింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మాంజా గొంతుకు లోతుగా కోసుకోవడంతో అద్వైక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చైనా మాంజా వల్ల మనుషులు, పక్షులు, జంతువులు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ చైనా మాంజా విక్రయాలు కొనసాగుతుండటంతో అనేక మంది గాయపడుతున్నారు. కాగా.. తెలంగాణలో చైనా మాంజా విక్రయం, వినియోగం, రవాణా పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రూ.1.24కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దాదాపు 143 మందిని అరెస్టు చేశారు. వేలాదిగా బాబిన్లను పట్టుకున్నారు. అటు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ పోలీసులు తనిఖీలు చేసి.. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. చైనా మాంజాను పూర్తిగా నిషేధించాలని.. ఎక్కడైనా ఈ మాంజాను విక్రయించినా, వినియోగించినా సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
బీదర్ సమీపంలో..
కర్ణాటకకు చెందిన ఓ బైకర్ ఈ మాంజా కారణంగా దుర్మరణం చెందారు. బీదర్ జిల్లా తలమడగి వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని సంజు కుమార్ హళసమణిగా గుర్తించారు. హళసమణి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన మెడకు మాంజా చుట్టుకోవడంతో కోసుకుపోయి గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమైంది. ఆయన తన కూతురికి ఫోన్ చేసి సమాచారం అందించే ప్రయత్నంలో ఉండగానే కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల వారు గాయాలకు కర్చీఫ్‌లను అడ్డుపెట్టి రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మరికొందరు అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే, బాధితుడిని హాస్పిటల్‌కి తరలించే క్రమంలోనే కన్నుమూశారు. హళసమణి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే ఆయన ప్రాణాలతోనే ఉండి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాప్యమే ఆయన ప్రాణాలను తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో మృతుడి బంధువులు, స్థానికులు ధర్నాకు దిగారు. ఎమర్జెన్సీ సర్వీసులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైనా మాంజాపై నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





