– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సేతు బంధన్ పథకం కింద రూ.103 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘సేతుబంధన్’లో భాగంగా సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆరఎఫ్) కింద రూ.103 కోట్ల పనులకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఆమోదం తెలిపింది. నల్గొండ జిల్లా పరిధిలో నార్కట్ పల్లి- మునుగోడు రైల్వే లైన్‌లోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి రూ.69 కోట్లు, ఖమ్మం జిల్లా మధిరలోని రైల్వే లైన్ దగ్గర అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు అప్రోచ్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం రూ.34 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే స్థానిక ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని, రవాణా మెరుగుపడటంతోపాటు రైల్వే ప్రమాదాలు తగ్గుముఖం పట్టనున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




