ఎంపికైన వారికి మంత్రి తుమ్మల అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం-2024కి ఎంపికైన చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా వారిలో తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం గర్వకారణమని అన్నారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో రూ.8 కోట్ల టర్నోవర్ చేసినందుకు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద, సహజ సిద్ద రంగులను ఉపయోగించి జీఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్‌తో పట్టు చీరను నేసిన గూడ పవన్ జాతీయ చేనేత అవార్డుకు ఎంపికై చేనేత రంగంలో ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనిస్తుందని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఇటీవల చేనేత కార్మికుల కోసం రుణమాఫీ ప్రకటించి రూ.33 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగేందుకు ప్రత్యేక లేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ నేతన్నకు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తెలిపారు.



