ప్రారంభానికి మరో రెండు చెరువులు సిద్ధం

– 8న బమృకున్-ఉద్-దౌలా
– 9న కూకట్‌పల్లి నల్ల చెరువు
– సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు
– చెరువుల అభివవృద్ధికి పెద్ద పీట వేసిన హైడ్రా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాత బస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువుతోపాటు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈనెల 8న బమృకున్- ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 9న కూకట్‌పల్లి నల్ల చెరువును కూడా సీఎం నగర ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన ఆరు చెరువుల్లో ఇప్పటికే అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన విషయం విదితమే. మరో మూడు చెరువులు (ఉప్పల్ నల్ల చెరువు, మాదాపూర్‌లోని సున్నం చెరువు, తమ్మిడికుంట) నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడత మరో 14 చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇలా నగరంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖలు మార్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది. చెరువులు, నాలాలను పరిరక్షించి వరదలు లేని, పర్యావరణహితమైన నగర నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం దిశలో చెరువుల అభివృద్ధికి హైడ్రా పెద్దపీట వేసింది. నగరం నలువైపులా ఉన్న మరో నాలుగు పెద్ద చెరువులను కూడా ట్యాంక్ బండ్ మాదిరి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పాత బస్తీకి మణిహారం బమృకున్-ఉద్-దౌలా చెరువు

పాత బస్తీకి మణిహారం చారిత్రక బమృకున్-ఉద్-దౌలా చెరువు. నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. కబ్జాలను తొలగించి ఊపిరిలూది చారిత్రక వైభవాన్ని చాటింది. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న చరిత్రకు హైడ్రా ప్రాణం పోసింది. నిజాంల నాటి కట్టను మరింత పటిష్టం చేసి వాకింగ్ ట్రాక్‌ను నిర్మించింది. కట్టపై ఓపెన్ జివమ్‌ను ఏర్పాటు చేసి అన్ని వయసులవారి ఆరోగ్యానికి బాటలు వేసింది. చెరువు లోపలి వైపు ఫెన్సింగ్ పనులను పూర్తిచేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేసింది. వృద్ధులు సేదదీరే విధంగా అక్కడ గజబోలు నలువైపులా నిర్మించారు. చెరువుకు మూడు వైపులా ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉంది. దానిని పునరావృతం చేసేలా చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు నాటారు. సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

విహార కేంద్రంగా ..

కాంక్రీట్ జంగిల్‌గా నగరాలు మారిపోతున్న వేళ పాత బస్తీలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరువలో అభివృద్ధి చేస్తున్న ఈ చెరువును విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించింది. చెరువు చుట్టూ పెరిగిన చెట్లతో బయట వాతావరణం కంటే కనీసం 3 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు తగ్గాలని ప్రభుత్వం భావించిన మాదిరి చర్యలు తీసుకున్నారు. నిజాంల కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి కట్టడాన్ని పటిష్టం చేశారు. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు విశాలంగా నిర్మించారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్ ఇలా 10 కి.మీ మేర చెరువుకు వర్షపు నీరు వచ్చేలా ఇన్‌లెట్లు నిర్మించారు. ఈ ప్రాంతంలో వరద కష్టాలకు ఈ చెరువు చెకెù పెట్టేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

చరిత్రను చాటేలా..

1770లో మూడవ నిజాం సికందర్ జాహ్ పాలనలో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్-ఉద్-దౌలా ఈ చెరువును నిర్మించారని, అందుకే బమృకున్-ఉద్-దౌలా పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తాగు నీటి అవసరాలు తీర్చేలా 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉందని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో చెరువు విస్తీర్ణం తగ్గుతూ వస్తుండగా హెచఎండీఏ ఈ చెరువును 17.05 ఎకరాలుగా నిర్ధారించింది. చివరికి 4.12 ఎకరాలుగా మిగిలిపోయింది. హైడ్రా 2024 ఆగస్టులో ఆక్రమణలను తొలగించింది. హెచఎండీఏ పేర్కొన్న విధంగా పూర్తిస్థాయిలో భూమి అందుబాటులోకి తెచ్చింది. ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు అనేక అవరోధాలను అధిగమించి విమర్శలను ఎదుర్కొంది. అలా విమర్శించిన వారే ఔరా అనేట్టు ఈ చెరువును హైడ్రా అభివృద్ధి చేసింది. కలలో కూడా ఊహించడం కష్టంగా ఉన్న ఈ ప్రాంతానికి ఇంత అందాన్ని తీసుకొచ్చిన హైడ్రాకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని అభినందిస్తున్నారు.

చెరువు చుట్టూ చరిత్ర

అడుగడుగునా చారిత్రక ఆనవాళ్లు, ఎన్నో విశేషాలు స్థానికంగా ఉన్న వృద్ధులు పలు విధాలుగా వివరిస్తున్నారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చెబుతున్నారు. నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమృకున్-ఉద్-దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు. అలాగే బమృకున్-ఉద్-దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి ఆ దిగువన నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు నిజాం పాలకులు వినియోగించేవారని మరికొంతమంది వివరిస్తున్నారు. ఔషధ గుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారంటున్నారు. అంతేకాదు ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని, ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని, ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లేవారనికూడా చెబుతున్నారు.

కూకట్‌పల్లి నల్ల చెరువు

అత్యధిక జనసాంద్రŠత.. ఎటు చూసినా నివాసాలు.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు.. కాంక్రీట్ జంగిల్‌లా మారిన ప్రాంతంలో కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలకు గురై బిక్కుబిక్కుమంటున్న తరుణంలో ప్రభుత్వ దృష్టి ఆ చెరువుపై పడింది. మురుగు నీటితో దుర్గంధభరితంగా మారిన ఈ చెరువును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబరులో ఆక్రమణలు తొలగించినప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. చెరువులోకి జరిగి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్లను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతోపాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే కాÅ£ 3 మీటర్లకుపైగా మట్టిని కూడా తొలగించింది. దాంతో దుర్గంధం దూరమైంది. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయ్యింది. 16 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువు 30 ఎకరాలకు విస్తరించుకుంది. అక్కడ నివాసం ఉన్న వాళ్లే అచ్చెరవొందేలా నల్ల చెరువు రూపు మారింది. బోటు షికారుకు చిరునామా అయ్యింది. ఎన్ని ప్రయాసలో.. ఎన్ని ఎదురు దెబ్బలో.. మరెన్ని విమర్శలో.. వీటన్నిటినీ తట్టుకుని పని చేసిన హైడ్రా కష్టానికి ఫలితమైంది. చెరువు అభివృద్ధి పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు

నల్ల చెరువును హైడ్రా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడి పరిసరాలు ఆహ్లాదంగా మారాయి. 5 కి.మీ దూరం నుంచి ఈ చెరువు చెంత సేద దీరేందుకు, వాకింగ్‌కు, పిల్లలను ఆడించేందుకు వస్తున్నామని సందర్శకులు చెబుతున్నారు. వర్షం పడితే చెరువులోకి వెళ్లడానికి దారి లేక వరదంతా నివాస ప్రాంతాలను ముంచెత్తేది. ఇప్పుడు నల్ల చెరువులోకి 7 ఇన్‌లెట్ల ద్వారా నీరు చేరుతోంది. చెరువు నిండితే సులభంగా వెళ్లేందుకు గతంలో ఉన్న ఔట్‌లెట్లను అభివృద్ధి చేశారు. మురుగు నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెరువు కట్ట బయట నుంచి మురుగు నీటి నాలాను మళ్ల్లించారు. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించారు. బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు కిలోమీటరున్నర పాత్ వే అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది. ఆరోగ్య పరంగా మంచి సౌకర్యాలు కల్పించారు. బహుళ ప్రయోజనకారిగా చెరువును తీర్చిదిద్దారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *