భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

– హర్మూజ్‌ ‌దాటి భారత్‌ ‌వైపు రాక
– ఇరాన్‌ ‌సహకారంతో సురక్షితంగా నౌకాయానం
-వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

న్యూదిల్లీ, మార్చి 14: భారత్‌ ‌మరో విజయం సాధించింది. గల్ఫ్ ‌నుంచి రెండు ఇంధన నౌకలను అత్యంత సురక్షితంగా దేశానికి చేరుకునేలా చేసింది. హర్మూజ్‌ ‌జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్‌ ‌పేర్కొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో రెండు భారత జెండాలు ఉన్న  ఎల్పీజీ నౌకలు శనివారం ఉదయం సురక్షితంగా హర్మూజ్‌ ‌జలసంధిని దాటాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ’శివాలిక్‌’, ’‌నందాదేవి’ పేరు గల నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్‌ ‌మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ ‌సిన్హా వెల్లడించారు. ఈ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉందని, మార్చి 16 లేదా 17వ తేదీన ఇవి భారత్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు. గల్ఫ్‌లో ఉన్న భారతీయ నౌకలు క్షేమంగానే ఉన్నాయని, వాటిలో ఉన్న భారత సిబ్బందికి ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హర్మూజ్‌ ‌జలసంధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపింది. భారత నావికుల కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని వెల్లడించింది. దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోన్న సమయంలో తాజా పరిణామం ఊరట కలిగించే అంశం. గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అవసరం లేకున్నా చాలామంది బుకింగ్‌ ‌చేస్తున్నారని తెలిపింది. బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలని రాష్ట్రాలను కోరామని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. దేశంలో గ్యాస్‌, ఎల్పీజీ లభ్యతపై ఆందోళనలు నెలకొన్నవేళ.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం శాఖ అధికారులు డియా సమావేశంలో వెల్లడించారు. వాణిజ్య సిలిండర్లను ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తున్నాం. ఎల్పీజీ సరఫరాలో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవు. అక్రమంగా నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌, ‌బిహార్‌, ‌కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో వాణిజ్య సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసే వారిపై దాడులు చేస్తున్నాం. ఎల్పీజీ సరఫరాలో గృహాలు, ఆసుపత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నాం. సిలిండర్‌ ‌బుక్‌ అవడం లేదని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. బుకింగ్‌కు గ్రామాల్లో 45 రోజులు, పట్టణాల్లో 25 రోజుల కనీస గడువు ఉందని పెట్రోలియం శాఖ అధికారులు పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *