– పునరావాసం కల్పిస్తామన్న అల్లూరి జిల్లా ఎస్పీ
పాడేరు, ఫిబ్రవరి 18: ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం జిల్లా ఎస్పీ బర్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా వినియోగించుకుని గౌరవప్రదమైన, శాంతియుత జీవితం గడపాలని లొంగిపోయిన మావోయిస్టులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ ప్రాయోజిత శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని వారికి సూచించారు. అలాగే ఇతర మావోయిస్టులు సైతం సప పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోవాలన్నారు. అలాకాకుంటే కుటుంబ సభ్యుల ద్వారా నేరుగా సీనియర్ పోలీస్ అధికారులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరు మహిళ ఉన్నారని తెలిపారు. కడితే హిడిం అలియాస్ అంజు అలియాస్ కరుణ- డివిజినల్ ఏరియా కమిటీ మెంటర్, బడ్చే భీమా అలియాస్ మనీష్ ఏరియా కమిటీ మెంటర్ గా పని చేశారని ఎస్పీ వివరించారు. వీరు పలు నేరాలలో నిందితులని పోలీసులు చెప్పారు. మరోవైపు తాము లొంగిపోవడానికి గల కారణాలను ఈ మావోయిస్టులు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల ఆపరేషన్లు తీవ్రతరం చేశారని, కొత్త పోలీసు శిబిరాల ఏర్పాటు చేయడం వల్ల మావోయిస్టుల కదలికలు పరిమితం అయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రాణ భయం ఏర్పడిందని, మావోయిస్టులకి ప్రజల మద్దతు తగ్గిపోవడం కూడా ఒక కారణమన్నారు. అలాగే సిద్దాంతాలపై విశ్వాసం కోల్పోయినట్లు చెప్పారు. నిరంతర లొంగుబాట్ల కారణంగా పార్టీ సిద్దాంతాలపై నిరాశ పెరిగిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో పలువురు సీనియర్ మావోయిస్టు నేతలు మరణించడంతో తమ కార్యకలాపాల తీవ్రంగా బలహీనపడ్డాయని చెప్పారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఆకర్షణీయమైన లొంగుబాటు ప్రయోజనాలు – ఆర్ధిక సహాయం, భూమి, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కలగడంతో తీవ్రవాదాన్ని విడిచి జన జీవన స్రవంతిలోకి తిరిగి వచ్చామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.