– వచ్చే వారంలో నూతన అక్రిడిటేషన్ విధివిధానాలపై చర్చిద్దాం
– ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం
– టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి
వైరా, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడటంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం.. 18 నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకారం ఎంతో ఉంది.. ఏ నిమిషం కూడా జర్నలిస్టులను మర్చిపోను.. వారి న్యాయమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది అని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. వైరాలోని శబరి గార్డెన్‌లో గురువారం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకున్న మహాసభకు నేను రావడం ఆనందంగా ఉంది.. పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో నేనూ కొంతకాలం ఉన్నప్పటికీ మీకోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొనసాగాను.. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, నిజాన్ని వెలికితీయడంలో మీరు పడ్డ బాధలు నాకు తెలుసు.. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు ఉన్నారు.. మీ మూడు కోరికల్లో ఒకటి ఇండ్ల స్థలాల కేటాయింపు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఎలా చేస్తే మేలు చేకూరుతుందో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం.. రెండోది నూతన అక్రిడేషన్ జారీ విధివిధానాలపై సోమ, లేదా మంగళవారాల్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందాం.. దీనిపై ఓ స్పష్టత వస్తే మూడవదైన హెల్త్ కార్డులు ఇవ్వడమనేది పెద్ద ఇబ్బంది కాదు’ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మీ న్యాయమైన కోరికలను నెరవేర్చడంలో సరైన దృక్పథంతో ముందుంటామని మరోమారు స్పష్టంగా చెప్పదల్చుకున్నానన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సమస్యాత్మకం కావొద్దని, ఏ ఒక్కరూ కూడా వేలెత్తి చూపొద్దనే ఉద్దేశంతోనే మీడియా మిత్రుల కోరికల అమలులో జాప్యం జరుగుతోందంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఈ ప్రభుత్వం ఇవ్వదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.



