మలుపు తిప్పనున్న అమెరికా జోక్యం

ఇరాన్‌, ఇజాయ్రెల్‌ యుద్ధంలో త‌ల‌దూర్చిన‌ పెద్దన్న
ఇరాన్‌ గగనతలంపైకి బాంబు దాడి 

ప్రజాతంత్ర ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అనుకున్నదే జరిగింది. ఊహాగానాలు నిజమయ్యాయి. ఇరాన్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కి అండగా అమెరికా ప్రత్యక్ష జోక్యం చేసుకుంది. ఆదివారం ఉదయం ఇరాన్‌పై అమెరికా  బాంబుల దాడికి దిగింది. ఇరాన్‌పై దాడి నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు తీసుకుంటానన్న ట్రంప్‌ రెండు రోజులకే మాట మార్చి ఆ దేశంపై దాడికి దిగి మరోసారి తనది మ్యాడ్‌ మాన్‌ పాలసీగా చాటుకున్నాడు. ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్‌ క్షేత్రాలను టార్గెట్‌ చేసి అమెరికా బాంబింగ్‌ చేసింది. ఈ ప్రత్యక్ష యుద్ధంతో అట్లాంటిక్‌ అవతలనున్న అగ్రరాజ్యం మధ్య ప్రాచ్య యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది. ఇంతకాలం తెర వెనక యుద్దాలు రగిల్చి తెరపై మధ్యవర్తి పాత్రను పోషించిన అమెరికా ఈనెల 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల వెనక అమెరికా పాత్ర ఉందన్న అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల, పరిశీలకుల అంచనా నిజమేనని రుజువైంది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం రెండు స్వతంత్ర దేశాల మధ్య యుద్ధం కాదని, అమెరికా ఏజెంట్‌గా ఇరాన్‌ మీద ఇజ్రాయెల్‌ యుద్దానికి దిగిందనే పరిశీలకుల అంచనా నిజమని రుజువైంది. బయటకు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధంగా కనబడినా లోతుగా పరిశీలిస్తే సామ్రాజ్యవాదానికీ, స్వతంత్ర దేశాలకు మధ్య యుద్ధంలో భాగమని కూడా రుజువయింది. ఆఫ్ఘన్‌, ఇరాక్‌లలో వలే ఇరాన్‌పైకి భూతల యుద్దానికి అమెరికా తన సైన్యాలను దింపడానికి సిద్దపడుతుందో లేదో కానీ ఈరోజు ఇరాన్‌పై గగనతల యుద్దానికి స్వయంగా దిగడం ద్వారా ప్రత్యక్ష యుద్ధ భాగస్వామిగా మారింది. వర్తమాన బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు కూడా అమెరికా ఇప్పుడు తీవ్ర సవాల్‌ విసిరింది. బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థను ఆలంబనగా చేసుకుని బలపడుతోన్న రష్యా, చైనా కూటమికి కూడా ఇదొక సవాలే. ఇప్పుటికే ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం, గాజాపై ఇజ్రాయెల్‌ జినోసైడ్‌లతో వర్తమాన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు తీవ్రంగా వేడెక్కాయి. ఆ స్థితిలో ఇప్పుడు అమెరికా పాత్ర కుదుపునకు గురిచేసి కొత్త మలుపు తిప్పుతుంది.
ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే పడమర భూగోళంలోని అగ్రరాజ్యమైన అమెరికా అట్లాంటిక్‌ సముద్రాన్ని దాటి, యూరోప్‌ ఖండం దాటి, ఆసియాకు చెందిన సంపన్న చమురు సీమ అయిన మధ్యప్రాచ్యంపైకి నేడు యుద్దానికి దిగింది.

అవి జీబీయూ-57 బంకర్‌ బస్టర్‌ బాంబులు

ఇరాన్‌లోని భూగర్భంలో దాగి ఉన్న అణుపదార్థ శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు జీబీయూ-57 బంకర్‌ బస్టర్‌ బాంబులను వాడినట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. మొత్తం ఆరు జీబీయూ-57 బాంబులను ఫర్డో అణుస్థావరంపై వదిలినట్టు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ఆయుధాన్ని అమెరికా గతంలో ఎన్నడూ వాడలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏమిటీ జీబీయూ-57

అమెరికా ఆయుధ సంపత్తిలో అత్యంత శక్తిమంతమై సంప్రదాయక ఆయుధం జీబీయూ-57. ఇది భూమిలోకి 200 అడుగుల లోతు వరకూ దూసుకెళ్లి విధ్వంసం సృష్టించగలదు. దాదాపు 60 అడుగుల మందంలో ఉన్న కాంక్రీట్‌ స్లాబ్స్‌లోంచి దూసుకెళ్లి శత్రువును ఛేదించగలదు. భూగర్భంలో, దుర్భేద్యమైన కట్టడాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు అమెరికా జీబీయూ-57ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకుంది. ఇక ఫర్డో అణు శుద్ధి కేంద్రం భూగర్భానికి సుమారు 195 అడుగుల నుంచి 295 అడుగుల లోతున ఉండి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ దళాలు అంచనా వేశాయి. ఇంతలోపలకు వెళ్లి ధ్వంసం చేసేందుకు అమెరికా రెండు బీజీయూ -57లను వాడి ఉండొచ్చు. మొదటి బాంబుతో ఏర్పడిన భారీ గొయ్యిలోకి రెండో బాంబు దూసుకెళ్లి చివరన ఉన్న అణు స్థావరాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో బాంబు దాదాపు 15 టన్నుల (30 వేల పౌండ్ల) బరువు ఉంటుంది. బీ-2 స్పిరిట్‌ బాంబర్ల ద్వారా మాత్రమే దీన్ని ప్రయోగించడం సాధ్యమవుతుంది. ఇజ్రాయెల్‌ వద్ద కేవలం 2 వేల నుంచి 5 వేల పౌండ్‌ల బరువున్న బంకర్‌ బస్టర్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ స్థావరాన్ని టార్గెట్‌ చేయలేక ఇజ్రాయెల్‌ ఇక్కట్ల పాలయింది. జీబీయూ-57తోపాటు అమెరికా టామాహాక్‌ మిసైళ్లను కూడా ప్రయోగించింది. నేవీ సబ్‌మెరైన్‌ల నుంచి వీటిని లాంచ్‌ చేస్తారట. నాటనాజ్‌, ఇస్ఫహాన్‌ అణు స్థావరాలను వీటితోనే ధ్వంసం చేసినట్టు సమాచారం. ఇరాన్‌పై ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో ఇదే అత్యంత సంక్లిష్టమైనదని విశ్లేషకులు చెబుతున్నారు.
నెతన్యాహు ప్రశంసల వర్షం ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో తొలిసారిగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఇది చరిత్రాత్మక క్షణమని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై యుద్ధం చేయడమన్నది సాహసోపేతమైన చర్య అంటూ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *