దేశీ ప‌సుపు గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో పోటీప‌డాలి

– గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత బోర్డుదే
– ముడి స‌ర‌కే అమ్మ‌కుండా విలువ జోడింపుపై దృష్టి పెట్టాలి
– రైతు సంక్షేమానికి టర్మరిక్‌ సమ్మిట్‌ బాటలు వేయాలి
– టర్మరిక్‌ వాల్యు చెయిన్‌ సమ్మిట్‌ -2025లో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఐఐ, తెలంగాణ, నేషనల్‌ టర్మరిక్‌ బోర్డు సంయుక్తంగా హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన టర్మరిక్‌ వాల్యు చెయిన్‌ సమ్మిట్‌-2025లో పసుపు రైతుల సంక్షేమం, విలువ జోడింపు, ఎగుమతుల అవకాశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌లో అగ్రి విజన్‌-2047ను ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇందులో వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్‌గా చూస్తున్నామని, అగ్రి విజన్‌లో పసుపుకి కూడా పాత్ర ఉందని తెలిపారు. మెడిసిన్‌, న్యూట్రాస్యూటికల్స్‌, ఫంక్షనల్‌ ఫుడ్స్‌ వంటి రంగాల్లో పసుపు వినియోగం పెరుగుతోందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పసుపు సాగులో భారత్‌ అగ్రస్థానంలో ఉందంటూ ఆ రైతుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు. పసుపును అధికంగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని, నిజామాబాద్‌, ఆర్మూర్‌ ప్రాంతాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, ఆర్మూర్‌ పసుపునకు జీఐ ట్యాగ్‌ రావడం తెలంగాణ రైతులకు గర్వకారణం అని మంత్రి తుమ్మల అన్నారు. నిజామాబాద్‌ రైతుల చిరకాల ఆకాంక్ష అయిన నేషనల్‌ టర్మరిక్‌ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బోర్డు రైతులకు పాలసీ దిశ చూపే సంస్థగా పనిచేయాలని, పరిశోధనను రైతు పొలాలకు తీసుకెళ్లాలని, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌, ఎగుమతుల్లో నాయకత్వం వహించాలని కోరారు. ధరల హెచ్చు, తగ్గుల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా ఉత్పత్తికి రైతు రూ.8వేల నుంచి రూ.9 వేల వరకు ఖర్చు చేస్తుండగా మార్కెట్‌ ధరలు రూ.12,000 అటుఇటుగా మాత్రమే ఉండటం నిరుత్సాహపరుస్తోందన్నారు. నేషనల్‌ టర్మరిక్‌ బోర్డు విజన్‌ 2047కనుగుణంగా పనిచేసి ధరల స్థిరత్వం, ముందస్తు మార్కెట్‌ సంకేతాలు రైతులకు అందించాలన్నారు. ప్రామాణిక మాయిశ్చర్‌ మీటర్లు, ఒకే రకమైన తేమ ప్రమాణాలు, పారదర్శక మార్కెట్‌ వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. విజన్‌లో ప్రతిపాదించినట్టు అధిక కర్క్యూమిన్‌ రకాలను రైతులకు అందించడంతోపాటు, నాణ్యమైన టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రపంచ ప్రమాణాలకు తగ్గ పసుపు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడు మాత్రమే తెలంగాణ పసుపు ప్రపంచ మార్కెట్లలో స్థిరంగా నిలబడుతుందన్నారు. విజన్‌ 2047 ప్రకారం ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌లో పసుపును భాగం చేయాలని సూచించారు. ఆయిల్‌ పామ్‌ వంటి పంటల్లో చెట్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పసుపు వంటి స్పైస్‌ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా రైతులకు తక్కువ రిస్క్‌తో అధిక ఆదాయం లభిస్తుందన్నారు. రైతులు ముడి పసుపును మాత్రమే అమ్మకుండా విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. పసుపు ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి న్యూట్రాస్యూటికల్స్‌, ఇమ్యూనిటీ ఉత్పత్తులు, కాస్మెటిక్స్‌, కర్క్యూమిన్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ వంటి ఉత్పత్తుల తయారీకి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. దీంతో డిమాండ్‌ పెరిగి రైతుల ఆదాయం పెరుగుతుందని, అప్పుడే రాష్ట్ర అగ్రి విజన్‌ లక్ష్యాలకు చేరువవుతామని మంత్రి అన్నారు. సమావేశంలో టర్మరిక్‌ బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్‌, టర్మరిక్‌ బోర్డు సెక్రటరీ భవానీశ్రీ, సిఐఐ తెలంగాణ చైర్మన్‌ శివప్రసాద్‌ రెడ్డి, అగ్రి యూనివర్సిటీ మాజీ వీసీ ప్రవీణ్‌ రావు, రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు గంగాధర్‌, సింథైట్‌ ఇండస్ట్రీస్‌ స్ట్రాటజిక్‌ సోర్సింగ్‌ హెడ్‌ జయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *