– దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
– ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ఒక్కో హామీ అమలు
– సిరిసిల్లలో నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల చెక్కుల పంపిణీ
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. సిరిసిల్లలో మంగళవారం నిర్వహించిన నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూలి గత పదేళ్లుగా ఉన్న బకాయిలను ప్రజా ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. నేత కార్మికుల కోరిక మేరకు రూ.లక్ష రుణ మాఫీ వర్తింపచేస్తున్నామని, రూ.33 కోట్ల రుణాలను రాబోయే కేబినెట్ సమావేశంలో మాఫీ చేయనున్నట్లు తెలిపారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2500 మెట్రిక్ టన్నుల నూలు వంద సొసైటీలకు సరఫరా చేసినట్లు వెల్లడిరచారు. నేతన్న చేయూత, నేతన్న పొదుపు, నేతన్న బీమా వంటి అనేక పథకాల బకాయిలను జమ చేస్తున్నామని వివరించారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా పేదలపై పన్నుల భారం మోపకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేస్తున్నామని చెప్పారు. వస్త్ర పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను పెంచేందుకు హ్యాండ్లూమ్ యూనివర్సిటీ (ఐఐహెచ్‌టి) ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఒక్క చీరపై రూ.450లు ఖర్చు చేస్తూ 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
మంత్రి అడ్లూరి మాట్లాడుతూ చేనేత, పవర్ లూం కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. 6 నుంచి ఇంటర్ వరకు సంక్షేమ గృహాల్లో చదివే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధార్మిక, కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. నేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు చేపట్టిందన్నారు. వస్త్ర పరిశ్రమలో రూ.352 కోట్ల బకాయిలను రేవంత్ సర్కార్ చెల్లించిందన్నారు. చేనేత కార్మికులకు పని కల్పించాలనే లక్ష్యంతో రూ.270 కోట్ల విలువ గల బట్ట ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించిందని వెల్లడిరచారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఉత్పత్తి బకాయిలు దాదాపు రూ.350 కోట్లను ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. స్వశక్తి మహిళా సంఘాల మహిళలకు రెండు నాణ్యమైన చీరలు అందించాలని నిర్ణయించి, ఆ చీరల ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించామని అన్నారు. వేములవాడలో రూ.50 కోట్ల ఖర్చుతో నూలు డిపో ఏర్పాటు చేశామన్నారు. నేతన్న పొదుపు, నేతన్న బీమా, నేతన్నలకు రూ.లక్ష రుణ మాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు. శైలజా రామయ్యార్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల ఆర్డర్లను ఇప్పిస్తున్నదని తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ రaా మాట్లాడుతూ నేతన్న పొదుపు (త్రిఫ్ట్) పథకం కింద జిల్లాకు చెందిన 4,963 మంది వస్త్ర పరిశ్రమ కార్మికులకు రూ.24.80 కోట్లను, నేతన్న బీమా ఉండి మరణించిన 12 చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్వీ రావు, ఏడీ రాఘవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, నేత కార్మికులు, ఆసాములు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





