– ఏడాదంతా వారికి పని కల్పిస్తున్న ప్రజాప్రభుత్వం
-ౖ నేతన్న పొదుపు, నేతన్న భద్రత పథకాల చెక్కుల పంపిణీ
– సిరిసిల్లలో మంత్రి తుమ్మల
సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఇందిర మహిళా శక్తి పథకంతో ప్రజా ప్రభుత్వంలో నేతన్నలకు మహర్దశ పట్టిందని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్లలో నేతన్న పొదుపు, నేతన్న భద్రత పథకాల లబ్ధిదారులకు మంగళవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి చేనేత రంగానికి సుమారు రూ.1000 కోట్లు విడుదల చేశామన్నారు. రూ.168 కోట్లతో తెలంగాణ చేనేత అభయ హస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు, భరోసా, భద్రత పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేత కార్మికుల కుటుంబాల్లో పొదుపు ప్రోత్సహించడానికి వారి భద్రత కోసం మూడేళ్ల కాలపరిమితితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాలపరిమితి ఈ ఆగస్టులో ముగుస్తున్నందున పొదుపు, ప్రభుత్వ ప్రోత్సాహకం కలిపి రూ.68.14 కోట్లు ప్రస్తుతం కార్మికుల ఖాతాలో జమ చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు. పవర్ లూమ్ కార్మికుల సౌలభ్యం కోసం కాల పరిమితిని 36 నెలల నుండి 24 నెలలకు తగ్గించామన్నారు.
నేతన్న భరోసా, నేతన్న భద్రత
నేతన్న భరోసాలో భాగంగా జియో ట్యాగ్ మగ్గాలు గల వాస్తవ చేనేత కార్మికులకు నిర్దేశించిన వార్పులలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేసిన చేనేత కార్మికునికి ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికునికి రూ.6 వేలు అందిస్తామన్నారు. ఈ పథకం అమలుకు రూ.12 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణ చేనేత బ్రాండ్ కోసం ప్రత్యేక లేబుల్‌ను ఆవిష్కరించామన్నారు. అలాగే నేత కార్మికుల మరణానంతరం వారి కుటుంబాలకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నేతన్న భద్రత పథకాన్ని అమలు చేస్తున్నదని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 401 మంది మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.20.05 కోట్లను బీమా కింద అందించామన్నారు. ఇప్పటివరకు 40,834మంది నేత కార్మికులు, అనుబంధ కార్మికులు నమోదు చేసుకున్నారని, సిరిసిల్ల జిల్లాలో నేతన్న బీమా కింద 5,188 మంది నమోదు చేసుకున్నారని వివరించారు.
ఇందిర మహిళా శక్తి చీరలు
ఇందిర మహిళా శక్తి చీరల పథకంతో నేతన్నలకు నిరంతరం పని కల్పిస్తున్నామని, పవర్ లూమ్ కార్మికులకు 6 నుండి 8 నెలల వరకు నిరంతరం పని కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సిరిసిల్లలోని ఎంఏసీఎస్ సంఘాలలో, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లలో చీరల ఉత్పత్తి జరుగుతున్నదన్నారు. ఈ పథకం కింద 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)
రాష్ట్రంలోని నేత కార్మికుల పిల్లలకు హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ రంగంలో నూతన సాంకేతికతను అందించేందుకు మూడేళ్ల డిప్లోమా కోర్సును కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం 120మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తుమ్మల తెలిపారు.
రుణ మాఫీ, టెస్కోకు, యార్న్ సబ్సిడీ బకాయిల విడుదల
రూ.33.00 కోట్లతో చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేశామని, తద్వారా 5,691 మంది చేనేతలు లబ్ధి పొందనున్నా రని చెప్పారు. టెస్కోకు బకాయి ఉన్న రూ.630 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, తద్వారా చేనేత సహకార సంఘాలకు, ఎస్‌ఎస్‌ఐ, ఎంఏసీఎస్ సంఘాలకు చెల్లింపులు చేసినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. జీవో నెం.1 ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు కావలసిన వస్త్రాలు టెస్కో ద్వారా కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీంతో ఈ ఏడాది టేస్కోకు రూ.588 కోట్ల విలువైన ఇండెంట్స్ వచ్చాయన్నారు. మరమగ్గాల కార్మికులకు 10% నూలు సబ్సిడీ పథకం కింద 2018 నుండి 2022 వరకు ఉన్న అన్ని బకాయిలు రూ.39.72 కోట్లు విడుదల చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. అప్పెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్టు ఇండస్ట్రీస్‌ను ఏప్రిల్ 2025లో ప్రారంభించగా సిరిసిల్ల, చుట్టుపక్కల గ్రామాల నుండి 800 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌ఎవసతీష్ట్ర/ కేకే మహేందర్ రెడ్డి చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ సందీఫ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుళ్ళ సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుమల స్వరూపరాణి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





