– అధికారులు, సిబ్బంది సమస్యలపై సత్వరమే స్పందించాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్‌లో రూ.కోటి 5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కలిసి మంత్రి సోమవారం ఆవిష్కరించారు. అలాగే యూసఫ్ గూడ సర్కిల్‌లో రూ.కోటి 11 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, బీటి రోడ్డు విడిసీసీ(వాక్యూమ్ డీవాటరేటెడ్ సిమెంట్ కాంక్రీట్) రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని, ముఖ్యమంత్రి వద్దే మున్సిపల్ శాఖ ఉండటంతో హైదరాబాద్ మహానగరాన్ని ఒక గొప్ప విశ్వనగరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధికి మారుపేరైన వెంకటస్వామి గురించి దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో త్రిబుల్ ఆర్, మెట్రో, ఫోర్త్ సిటీ అలాగే మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి స్పష్టం చేశారు. . జీహెచ్‌ఎంసి ద్వారా ప్రతి డివిజన్లోని ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సంబంధిత కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసి అధికారులు ముందుండాలని మంత్రి సూచించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతగా అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో 60 శాతం ఇన్కమ్ ఇక్కడినుండే ఉంటుందని మంత్రి పిలుపు అన్నారు. డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాలు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు దగ్గరగా ఉండాలని ఈ వార్డులో ఏ సమస్యలు ఉత్పన్నమైన సత్వరమే స్పందించాలని కార్పొరేటర్లు మున్సిపల్ మున్సిపల్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. తదుపరి రూ. 44 లక్షలతో చేపట్టే నూతన డ్రైనేజీ పనుల శిలాఫలకానికి మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు అనేక అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందన్నారు. కార్పొరేటర్లు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఉంటే ప్రతిపాదనలతో ఇన్‌చార్జి మంత్రి దృష్టికి గానీ, తన దృష్టికి గానీ తీసుకువస్తే మంజూరు చేస్తామని తెలిపారు. దేశంలోనే గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అత్యుత్తమ నగరంగా, నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని, ప్రజా ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలనీ మేయర్ కోరారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్లు రాషత్ ఫరాజుద్దీన్, సీఎన్ రెడ్డి, యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ అజారుద్దీన్, నవీన్ యాదవ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్, మహిళా సంఘాల సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.




