– సంతృప్తిని వ్యక్తం చేసిన భక్తులు
– భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన టీటీడీ చైర్మన్
తిరుమల, ప్రజాతంత్ర, జూలై 15: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మంగళవారం రాత్రి టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు బోర్డు సభ్యులతోపాటు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్‌తో మాట్లాడుతూ ఈ ప్రసాదంలో అన్నం చాలా మృదువుగా, వంటకాలు రుచికరంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రాత్రి భోజనంలో వడను వడ్డించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్నప్రసాద వితరణ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిరంతరం పరిశుభ్రతతో కూడిన రుచికరమైన వంటకాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జంగా కృష్ణమూర్తి, శాంతా రామ్, నరేష్‌కుమార్, జానకీదేవిలు కూడా చైర్మన్, భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్ కూడా ఉన్నారు.




