మమ్మల్ని విశ్వసించండి.. ఆ భావజాలాన్ని వదలబోం

– మాజీ మావోయిస్టు తక్కెళ్ళపల్లి

కాళోజి జంక్షన్/హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : ప్రజలు తమను విశ్వసించాలని పాత భావజాలంలోనే నిబద్ధతగా నిమగ్నతగా ప్రజల కోసం పని చేస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అన్నారు. హనుమకొండ మండలం బట్టుపల్లి గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్ లో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలతో ఆశన్న తన దళ సభ్యులతో కలిసి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన మాజీ మావోయిస్టు సభ్యులు, పూర్వ పీపుల్స్ వార్ అమరుల కుటుంబాల సభ్యులు ఆశన్నను పలకరించి స్వాగతించారు. ఆశన్నతోపాటు బయటకు వచ్చిన బట్టుపల్లికి చెందిన దండకారణ్యం స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ మెంబర్ కందగట్ల యాదగిరి కూడా ఉన్నారు. మాజీ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కోమల్ల శేషగిరిరావు సహచరి కోమల్ల మంజుల, ఆమె కూతురు ఆశన్నను కలిసి భావోద్వేగాన్ని గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కుటుంబ సభ్యులను తాను ఉన్నానంటూ ఆశన్న ఓదార్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ, చత్తీస్గడ్ కు చెందిన మాజీ మావోయిస్టులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తక్కెళ్ళపల్లి మాట్లాడుతూ ప్రస్తుతం దండకారణ్యంలో విప్లవోద్యమంపై జరుగుతున్న దాడి ప్రజలందరికీ తెలుసన్నారు. విప్లవోద్యమం నుంచి వచ్చిన మిత్రులు విమర్శించినా సహనంతో అర్థం చేసుకుంటామని చెప్పారు. బయటి వ్యక్తులు తమను విమర్శించినప్పుడు కొంత బాధతోపాటు కోపం కూడా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. తాము వచ్చిన భావజాలంతో నిబద్ధతగా ప్రజల కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. విప్లవోద్యమకారులను కాపాడుకోవడంలో భాగంగానే తాము బయటకు వచ్చామని ఆయన వివరణ ఇచ్చారు. మిగిలిన కొద్దిమంది మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరుల ప్రాణ త్యాగాల ప్రేరణతో ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు. సమాజంలో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రజల కోసం నిజాయతీగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమను పూర్తిగా విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. తాము దేశాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు పోతామన్న పుకార్లను నమ్మవద్దని కోరారు. తాము ప్రజల మధ్యనే.. ప్రజల కోసమే చివరి వరకు జీవిస్తామని వివరించారు. తాము ఇప్పటివరకు చేసిన పోరాటానికి అనుసంధానంగానే భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించడానికి కృషిచేస్తామని తెలిపారు. బయటి సమాజంలో ప్రజల పక్షం వహించే పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం అనేది అంత సులభమైన పని కాదన్నారు. ఇప్పటివరకు ఈ సమాజం నుంచి తమకు కొంత రాజకీయ సామాజిక ఆలోచన విధానంలో ఖాళీలు ఉన్నాయని, వాటిని పరిపూర్ణం చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. తాము ఇంతకాలం ఏ ఆచరణతో పనిచేసామో భవిష్యత్తులో కూడా అదే ఆచరణతో ముందుకు సాగుతామని, తమను ప్రజలు విశ్వసించాలని కోరారు. తాము సమాజంతో కలిసి పనిచేయడానికి ఏదో ఒక నిర్మాణ రూపం మాత్రం అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమాజంలో ఇప్పటికే విద్యార్థులు, యువత, ప్రతిశీల వాదులు సమాజ మార్పు కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారని, ఆ మార్గంలో కూడా తాము భాగస్వామ్యం కావడానికి సమాలోచనలు చేస్తున్నట్లు రు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *