నిజం చెప్పాలంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల యు.ఎస్. ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగిందనే చెప్పాలి. ఉదాహరణకు ఒక్క జూలై మాసంలోనే 152 బిలియన్ డాలర్ల కస్టమ్స్ ఆదాయం లభించింది. అయితే ట్రంప్ అనుసరిస్తున్న ఈ విధానంవల్ల ప్రతికూల ఫలితాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పెంచిన టారిఫ్‌ల వల్ల తాము అధికమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నదని, దీన్ని మరెంతోకాలం భరించడం సాధ్యంకాదని అమెరికాలోని వాణిజ్యసంస్థలు మొత్తుకుంటున్నాయి. పెంచిన టారిఫ్‌ల కారణంగా యు.ఎస్.లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది.
ఒక్కసారిగా ట్రంప్ మొత్తం 90 దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ ఆదేశాలు జారీచేయడంతో, ఆయా దేశాలతో వాణిజ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. అయితే ట్రంప్ మిగిలిన దేశాలపై టారిఫ్‌ల పేరుతో చేస్తున్న బెదిరింపులు బూమరాంగ్ అయి అమెరికా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఈ టారిఫ్‌లనుంచి కొన్ని వాణిజ్య భాగస్వామి దేశాలను ఆయన మినహాయించినా, మొత్తంమీద గత వందేళ్ల కాలంలో అమెరికా ఇంతటి భారీ స్థాయిలో సుంకాల విధించిన దాఖలాలు లేవు. త్వరలోనే మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని సుంకాల దస్త్రంపై సంతకం చేయడానికి కొద్ది గంటల ముందు ట్రంప్ మరో బాంబు పేల్చడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు పెద్ద ఎత్తున కుదుపునకు లోనవడమే కాదు, వినియోగదారులు, వ్యాపారుల్లో ధరల పెరుగుదలపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
టారిఫ్‌లను పెంచుతూ గత వారం రోజులుగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీచేస్తూ వస్తున్నారు. అయితే ఇవన్నీ ఇటీవల ఐరోపా సమాఖ్య, ఇతర దేశాలతో తాము కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారమే ఈ సుంకాల విధింపు కొనసాగుతోందని ఆయన ప్రకటించారు. ఈవిధంగా దిగుమతి సుంకాలను పెంచడంవల్ల అమెరికా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, అక్కడి తయారీరంగానికి ప్రోత్సాహం లభించడమే కాదు ఇన్నేళ్లుగా అమెరికాకు ప్రతికూలంగా కొనసాగుతున్న అనుచిత వాణిజ్య విధానాలను గాట్లో పెట్టినట్టవుతుందని కూడా ట్రంప్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు.
నిజం చెప్పాలంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల యు.ఎస్. ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగిందనే చెప్పాలి. ఉదాహరణకు ఒక్క జూలై మాసంలోనే 152 బిలియన్ డాలర్ల కస్టమ్స్ ఆదాయం లభించింది. అయితే ట్రంప్ అనుసరిస్తున్న ఈ విధానంవల్ల ప్రతికూల ఫలితాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పెంచిన టారిఫ్‌ల వల్ల తాము అధికమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నదని, దీన్ని మరెంతోకాలం భరించడం సాధ్యంకాదని అమెరికాలోని వాణిజ్యసంస్థలు మొత్తుకుంటున్నాయి. పెంచిన టారిఫ్‌ల కారణంగా యు.ఎస్.లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. గత జూన్ మాసంలో వస్త్రాలు, గృహానికి అవసరమైన వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నమోదైనా అది ఆరోగ్యకరమైన రీతిలో లేదు. శ్రామిక మార్కెట్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. జూలై నెలలో కార్మికులకు ఉపాధి కల్పన బాగా మందగించడం గమనార్హం.
ట్రంప్ విధించిన టారిఫ్‌లు 15% నుంచి మొదలవుతున్నాయి. బొలీవియా, ఈక్వెడార్, ఐస్‌ల్యాండ్, నైజీరియా వంటి దేశాల ఎగుమతులపై ఈ 15% టారిఫ్ కొనసాగుతోంది. ఇక తైవాన్ వంటి దేశాల ఉత్పత్తులపై 20% టారిఫ్‌ను అమలు చేయడం వల్ల అమెరికన్ కొనుగోలుదార్లు ఆ పెరిగిన మేర పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తున్నది. ఇక బ్రెజిల్ నుంచి ఎగుమతి అయ్యే కొన్ని రకాల వస్తువులపై 50% వరకు టారిఫ్ విధించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైల్ బోల్సోనరోను శిక్షించినందుకు ప్రతీకారంగా ఈ టారిఫ్‌లు విధించినట్టు ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ దృష్టి భారత్‌పై పడింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షగా మనదేశ ఎగుమతులపై 50% టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు. రష్యానుంచి చమురు లేదా ఇతర వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలకు కూడా ఇదేమాదిరి శిక్ష విధించడం తథ్యమని ట్రంప్ బెదిరిస్తున్నారు. తాను చెబుతున్నా రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఆగడంలేదనేది ఆయన ఆగ్రహానికి కారణం. ఇందుకు రష్యాను శిక్షించే క్రమంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై టారిఫ్‌ల రూపంలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ టారిఫ్‌లు ఆగస్ట్ 7వ తేదీవరకు నౌకల్లో లోడ్ అయిన సరుకులకు వర్తించబోవు. అంతేకాదు ప్రస్తుతం సముద్ర ప్రయాణంలో వుండి వచ్చే అక్టోబర్ మొదటివారం లోపు అమెరికాకు చేరే నౌకల్లోని వాణిజ్య వస్తువులకు కూడా ఈ టారిఫ్‌లు వర్తించవు.
మొట్టమొదటిసారి ట్రంప్ ఈ టారిఫ్‌లు విధించిన దగ్గరినుంచి చిన్న దేశాలు ఎగుమతి చేసే వస్తువులపై 10శాతం టారిఫ్ విధింపు కొనసాగుతోంది. అయితే ట్రంప్ ఈ దేశాలపై విధించే పన్నులను తాత్కాలికంగా నిలుపుచేసి, తర్వాత ఆయా దేశాలతో జరిపిన వాణిజ్య చర్చల్లో ఈ పన్నులు 15-20శాతం వరకు వుంటాయని చావుకబురు చల్లగా చెప్పడంతో, కొన్ని దేశాలు యు.ఎస్.తో వాణిజ్యాన్ని నిలిపేశాయి. ఇక ఐరోపా సమాఖ్య దేశాలు, దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం వంటి దేశాలు తమ మార్కెట్లను యు.ఎస్. ఉత్పత్తులకోసం తెరవడానికి, అమెరికాలో బిలియన్ల డాలర్ల వ్యయంతో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయి.
కానీ కుదిరిన ఈ ఒప్పందాలు రోతపుట్టించే రీతిలో వుండటం ఆయా దేశాల దౌర్భాగ్యం. ఇక యు.ఎస్-మెక్సికో-కెనడా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పరిధిలోకి రాని కెనడా వస్తువులపై ట్రంప్ ఏకంగా 35% టారిఫ్ విధించారు. ఈ టారిఫ్‌లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇదే సమయంలో మెక్సికోతో చర్చలు కొనసాగుతుండటంతో ఆ దేశ ఎగుమతులపై అధిక టారిఫ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. ఇక చైనాతో ఈ ఏడాది జరిగిన చర్చల నేపథ్యంలో దాని ఎగుమతులపై 30% పన్ను విధింపు కొనసాగుతోంది. అయితే ఈ ఒప్పందం కాలపరిమితి వచ్చే మంగళవారంతో ముగియనుంది.
ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఆయన విధించిన టారిఫ్‌లే కొనసాగుతా యనుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం ఈ టారిఫ్‌లపై వివిధ ఫెడరల్ కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ వెనుకడుగు వేయడంలేదు. చిప్స్, కంప్యూటర్లు, విదేశీ తయారీ ఔషధాల వంటి ఉత్పత్తులపై మరిన్ని సుంకాలను విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం ఒక ప్రకటన చేస్తూ ఇప్పటివరకు టారిఫ్ విధించని సెమికండక్టర్లపై వందశాతం సుంకం విధిస్తానని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కూక్‌తో ట్రంప్ అన్న మాటలివి. అయితే అత్యున్నత సాంకేతికత కలిగిన చిప్స్ తయారీలపై ఈ సుంకాల విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు.
కానీ యు.ఎస్.లో మరో వంద బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని యాపిల్ ఇప్పటికే హామీ ఇచ్చింది! అయితే తాను అనుసరిస్తున్న విధానాలు యు.ఎస్.ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెబుతున్న మాటలను ట్రంప్ ఎంతమాత్రం ఖాతరు చేయడంలేదు. ధరలు తగ్గుతున్నాయని, రాబోయే కాలంలో దేశం మంచి అభివృద్ధి సాధించడం తథ్యమని ఆయన వాదిస్తున్నారు. ఈ టారిఫ్‌ల వల్ల కలిగే కష్టనష్టాలను విదేశీయులు మాత్రమే భరించాల్సివుంటుందని గతంలో ఒక సందర్భంలో ట్రంప్ అన్నారు. తాజాగా ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ట్రంప్‌కు అందించినప్పుడు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. కేవలం తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇటువంటి సమాచారం పట్టుకొస్తున్నాంరంటూ సదరు ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెంచిన టారిఫ్‌ల పుణ్యమాని సగటు అమెరికన్ ఇప్పుడు 18% వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. 1934 నుంచి ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. పెరిగిన ధరల పుణ్యమాని సగటు అమెరికన్ కుటుంబం ఏటా 2400 డాలర్ల మేర నష్టపోతారని బడ్జెట్ లాబెట్ యేల్ అనే ఒక పరిశోధక సంస్థ వెల్లడించింది. అంటే ఉత్పాకత పడిపోయి, 2025 నుంచి అరశాతం వృద్ధి పడిపోతుందని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
మూడీస్ ఎనలిటిక్స్ కు చెందిన ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు మార్క్ జండీ మాట్లాడుతూ, ఈ బెదిరింపు టారిఫ్‌ల వల్ల ఏర్పడిన వాతావరణం నేపథ్యంలో, ఆకాశాన్నంటే ధరలతో ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరగడం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం జరుగుతుందని అంచనా వేశారు.
దీనికితోడు వడ్డీరేట్లు తగ్గించా లని ఫెడరల్ రిజర్వ్ పై ట్రంప్ తీసుకొస్తున్న తీవ్రస్థాయి వొత్తిడి కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ పక్కదారి పట్టింది. మళ్లీ ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే టారిఫ్‌ల ప్రభావం ఎట్లా వుంటుంద నేది వెల్లడి కావడానికి కొంత సమయం పడుతుందని చెప్పే నిపుణులూ లేకపోలేదు. ముఖ్యంగా చాలా కంపెనీలు పెద్దమొత్తంలో దిగుమతులు చేసుకొని వుండటం వల్ల ఇప్పటికిప్పుడు వాటికొచ్చిన ప్రమాదం లేదు. అయితే ఇంకా టారిఫ్‌లు పెంచుతామని ట్రంప్ ప్రకటిస్తున్న నేపథ్యంలో, రాబోయే రెండు నెలల కాలంలో ఏదో ఒక పరిణామం వేగంగా చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని కొందరు ఆర్థిక నిపుణుల అంచనా.
-ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్





