– భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్ మంకుపట్టు
వాషింగ్టన్, ఆగస్టు 8: భారీ సుంకాల విధింపుతో భారత్‌పై కాలుదువ్వుతున్న ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో భారత్- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత్‌పై సుంకాల విధింపు అనంతరం చర్చలు కొనసాగుతాయా అన్న విూడియా ప్రశ్నకు ట్రంప్ ఉండవని తెలిపారు. విషయం కొలిక్కి వచ్చే వరకూ చర్చలు ఉండవు అని స్పష్టం చేశారు. అంతకుముందు కూడా భారత్‌పై ట్రంప్ రెచ్చిపోయారు. రష్యాతో వాణిజ్యం నెరిపే దేశాలపై మరిన్ని సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర దేశాలూ రష్యాతో వాణిజ్యం జరుపుతుండగా భారత్‌పైనే అక్కసు ఎందుకని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈమేరకు సమాధానం ఇచ్చారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 25 శాతం సుంకం విధిస్తోంది. అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కొత్త సుంకాలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత్‌పై విధించిన మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. కాగా, అమెరికా చర్యలను భారత్ ఖండిరచింది. సుంకాల విధింపు అన్యాయం, నిర్హేతుక, చట్టపరంగా సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో మా వైఖరిని ముందే స్పష్టం చేశామన్నది. మా దిగుమతులన్నీ మార్కెట్ పరిస్థితులు, 1.4 బిలియన్‌ల భారతీయులకు ఇంధన భద్రత
అందించడంపై ఆధారపడి ఉంటాయి అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కూడా ఘాటుగా స్పందించారు. గురువారం ఎమ్‌ఎస్ స్వామినాథన్ సెంటెనరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాని దేశ ప్రయోజనాల కోసం తాను వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, డెయిరీ రంగం విషయంలో భారత్ రాజీ పడదన్నారు.అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను కూడా భారత్ ఎండగట్టింది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనా, టర్కీపై సుంకాలు ఎందుకు విధించట్లేదని ప్రశ్నించింది. ఇక చైనా ఉత్పత్తులపై గతంలో ప్రకటించిన 145 శాతం సుంకాలను అమెరికా ఇప్పటికీ అమలు చేయని విషయాన్ని కూడా భారత్ ప్రస్తావించింది.





