– ఎప్‌స్టీన్ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణ
వాషింగ్టన్, ఏప్రిల్ 3 : యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీని ఆ పదవి నుండి ట్రంప్ యంత్రాంగం గురువారం తొలగించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. అంతర్జాతీయంగా వివాదాస్పదమైన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు పత్రాల నిర్వహణ సహా పలు అంశాలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా తాను దర్యాప్తు ఎదుర్కోవాలని కోరుకున్న విమర్శకులు, ప్రత్యర్థులపై అభియోగాలు మోపడంలో బోండీ తగిన విధంగా వ్యవహరించకపోవడం ట్రంప్‌ను తీవ్ర అసహనానికి గురిచేసినట్లు తెలిపాయి. పామ్ బోండీ పదవి నుండి తొలగింపునకు గురైన రెండవ సీనియర్ అధికారి. మార్చి 5న హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్‌ను ట్రంప్ పదవి నుండి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ శాఖ నిర్వహణ తీరుపైనా, ట్రంప్ వలస విధాన అజెండాపై వచ్చిన తీవ్ర విమర్శలతో క్రిస్టీ నోమ్‌ను పదవి నుండి తొలగించారు. అటార్నీ జనరల్‌గా బోండీ తన పదవీ కాలంలో ట్రంప్ అజెండాకు గట్టి మద్దతుదారుగా నిలిచారు. న్యాయశాఖ తన దర్యాప్తులో వైట్‌హౌస్ నుండి స్వతంత్రంగా వ్యవహరించే సుదీర్ఘ సాంప్రదాయాన్ని ఇది నాశనం చేసింది. ట్రంప్ మిత్రులు, కొంతమంది రిపబ్లికన్ చట్ట సభ్యులు సహా ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై వచ్చిన విమర్శలు ఆమెను చుట్టుముట్టాయి. పలు రాజకీయ శక్తులు, కార్పొరేట్ అధిపతులు, ఆర్థిక సంస్థలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, కుబేరులతో ఎప్‌స్టీన్ సంబంధాలపై అమెరికా న్యాయవ్యవస్థ డోజ్ జరిపిన దర్యాప్తు రికార్డులు వెల్లడికాకుండా అడ్డుకున్నారని, దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ అంశం ట్రంప్‌కు రాజకీయంగా తలనొప్ప్పులు సృష్టించడంతోపాటు దశాబ్దాల క్రితం ముగిసిపోయిందని ఆయన ప్రకటించిన ఎప్‌స్టీన్‌తో సంబంధంపై తిరిగి నిశిత దర్యాప్తు చేపట్టేలా చేసింది. కాగా, ఆమె తొలగింపు న్యాయ శాఖలో భారీ మార్పులకు దారితీయవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్న వారిపై డోజ్‌ను ప్రయోగించే దిశగా నూతన యత్నాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





