చ‌మురుపై ఆధిప‌త్యం కోసం తెగ‌బ‌డ్డ ట్రంప్‌!

అంతా అనుకున్న విధంగానే ఇజ్రాయిల్‌, అమెరికాలు ఉమ్మ‌డిగా శ‌నివారం ఇరాన్‌పై దాడుల‌కు దిగాయి. ఈ దాడుల‌కు ఇజ్రాయిల్ “ఆప‌రేష‌న్ లైన్ రోర్” అని పేరు పెడితే అమెరికా “ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీ” అని నామక‌ర‌ణం చేసింది. మ‌రోవైపు పాకిస్తాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌ల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న త‌రుణంలో మ‌ధ్య ప్రాచ్యంలో పోరు మొద‌లు కావ‌డం ప్రపంచ దేశాల‌ను అందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. అమెరికా, ఇజ్రాయిల్ లు ప్ర‌ధానంగా ఇరాన్ సైనిక స్థావ‌రాలు, క్షిప‌ణి కేంద్రాలు, దేశాధినేత అయ‌తుల్లా ఖ‌మేనీ కార్యాల‌యం ల‌క్ష్యంగా క్షిప‌ణుల‌తో దాడులు చేశాయి. ఇదే స‌మ‌యంలో డోనాల్డ్ ట్రంప్ ఒక ప్ర‌క‌ట‌న చేస్తూ త‌మ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇరాన్‌లో అధికార మార్పిడి, అణు ప్ర‌మాదాన్ని నివారించ‌డ‌మ‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇరాన్ కూడా త‌గ్గేదే లేద‌న్న రీతిలో బ‌హ్రైన్‌, కువైట్‌, ఖ‌తార్‌ల‌లోని యు.ఎస్‌, ఇజ్రాయిల్ సైనిక స్థావ‌రాల‌పై డ్రోన్‌ల‌తో దాడులు చేసింది. మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం చెల‌రేగ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారి కుదుపుల‌కు లోన‌య్యాయి. మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకొని, సుర‌క్షిత మార్గా ల‌ను ఎంచుకుంటుండ‌టం వ‌ర్త‌మాన ప‌రిణామం.

యుద్ధం ప్రారంభం కాగానే యు.ఎస్‌.లోని ఈక్విటీ మార్కెట్లు ప‌డిపోవ‌డం మొద‌లైంది. డోవ్ జోన్స్ 521 పా యింట్లు (1.05%) క్షీణించ‌గా, ఎస్‌అండ్ పి 500 పాయింట్లు (0.43%), నాస్‌డాక్ 0.92% క్షీణించాయి. కాగా భార‌తీయ మార్కెట్ల‌పై ఈ యుద్ధ ప్ర‌భావం సోమ‌వారం  క‌నిపిస్తుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా ఆరోజున మార్కెట్ గ్యాప్‌-డౌన్ (చాలా త‌క్కువ ధ‌ర‌తో)తో మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముం ద‌ని వారు విశ్లేషిస్తున్నారు. మొత్తంమీద స్టాక్ మార్కెట్లు ఒత్తిళ్ల‌కు లోనైన‌ప్ప‌టికీ, ర‌క్ష‌ణ రంగానికి చెందిన కంపెనీల షేర్లు ఇటువంటి యుద్ధ స‌మ‌యాల్లో జోరును ప్ర‌ద‌ర్శించ‌డం స‌హ‌జం. ఈ నేప‌థ్యంలో లాక్‌హీడ్ మార్టిన్‌, ఆర్‌టీఎక్స్ వంటి సంస్థ‌లు, ఇంధ‌న రంగానికి చెందిన కంపెనీల షేర్లు బాగా పెరిగే అవ‌కాశ‌ముంది. ముఖ్యంగా చ‌మురు ధ‌ర‌లు, సైనిక వ్య‌యం పెర‌గ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

యుద్ధం మొద‌లు కాగానే ముడి చ‌మురు ధ‌ర‌ల్లో పెరుగుద‌ల మొద‌లైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యార‌ల్ కు 3.4% పెరిగి, 72.87 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఇక డ‌బ్ల్యుటీఐ 3.2% పెరిగి 67.29 డాల‌ర్ల‌కు పెరిగింది. హార్మూజ్ జ‌ల‌సంధి వ‌ద్ద సంఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగితే చ‌మురు ధ‌ర‌లు బ్యార‌ల్‌కు 100 నుంచి 110 డాలర్ల‌కు పెరుతుంద‌ని చ‌మురు మార్కెట్ విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌లో బంగారం ధ‌ర 11% పెరిగి, ఔన్స్ కు 5296.50 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఇక వెండి కిలో ధ‌ర 8% వృద్ధి న‌మోదు చేసి 93.82 డాల‌ర్ల‌కు పెరిగింది. ఇక బిట్‌కాయిన్ దారుణంగా 62000 డాల‌ర్ల‌కు ప‌డిపోయి మ‌దుప‌ర్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్న‌ది.

గ‌తంలో మాదిరి ప‌రిమిత దాడులు కాకుండా, ఇప్ప‌డు ఏకంగా ఇరాన్‌లో ప్ర‌భుత్వాన్నే మార్చేయాల‌న్న ల‌క్ష్యంతో యు.ఎస్‌-ఇజ్రాయిల్‌లు ఉమ్మ‌డి దాడులు నిర్వ‌హిస్తున్నాయి.  ఈవిధంగా ఇరాన్‌పై ఒత్తిడి పెంచి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేయాల‌న్న‌ది ట్రంప్ ల‌క్ష్యం. తాజా యుద్ధం నేప‌థ్యంలో ఇజ్రాయిల్‌, ఇరాన్‌, ఇరాక్‌, యూఏఈ, ఖ‌తార్ దేశాలు త‌మ గ‌గ‌న‌త‌లాన్నిమూసివేశాయి. ఫ‌లితంగా అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాలు, వాణిజ్య మార్గాలు నిలిచిపో యే దుస్థితి ఏర్ప‌డింది. ఈ యుద్ధం దీర్ఘ‌కాలం కొన‌సాగితే అంత‌ర్జాతీయంగా వ‌డ్డీరేట్లు పెరిగే ప్ర‌మాద‌ముంది. ఫ‌లితంగా తీసుకునే రుణాల‌పై వ‌డ్డీభారం పెరిగిపోయి సామాన్యులు ఇక్క‌ట్ల‌కు గురికాక త‌ప్ప‌దు. మ‌రోప‌క్క పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో దేశాలు ద్ర‌వ్యోల్బ‌ణంతో ఉక్కిరిబిక్కిరి అవ‌డం ఖాయం.

మ‌రోప‌క్క పాక్‌-అఫ్ఘాన్ యుద్ధంలో యు.ఎస్‌. పాకిస్తాన్‌కు అధికారికంగా మ‌ద్ద‌తు తెలిపింది. ఆఫ్ఘ‌న్‌పై యుద్ధం చేయ‌డం పాక్ స్వీయ‌ర‌క్ష‌ణ హ‌క్కుగా పేర్కొంది. బ‌గ్రామ్ విమానాశ్ర‌యాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌న్న యు.ఎస్‌. కోర్కెను ఆఫ్ఘ‌న్ తాలిబ‌న్ ప్ర‌భుత్వం తిర‌స్క‌రించ‌డంతో, దాన్ని ఏదోవిధంగా స్వాధీనం చేసుకోవ‌డానికి ఉగ్ర‌వాదుల‌పై దాడుల పేరుతో పాక్‌ను ఉసిగొల్ప‌డంతో  రెండు దేశాల మ‌ధ్య యుద్ధం చెల‌రేగింది.  ఈ రెండు యుద్ధాల ద్వారా అమెరికా ల‌క్ష్యాలు రెండు. మొద‌టిది ఇరాన్‌లో ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి, ఇరాన్ రాజు పాల‌న‌ను మ‌ళ్లీ తీసుకు రావ‌డం ద్వారా అక్క‌డి చమురుపై పూర్తి ఆధిప‌త్యం సాధించ‌డం.

ఇప్ప‌టికే వెనెజులాను స్వాధీనం చేసుకున్న యు.ఎస్‌. ఇప్పుడు ఇరాన్‌ను కూడా త‌న ఆధీనంలోకి తెచ్చుకొని చ‌మురు మార్కెట్‌ను శాసించాల‌ని చూస్తున్న‌ది. అయితే   యు.ఎస్‌.కు ఇరాన్‌పై ఆధిప‌త్యం సాధించ‌డం అంత తేలిక కాక‌పోవొచ్చు.ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని బ‌గ్రామ్ విమానాశ్ర‌యాన్ని స్వాధీనం చేసుకొని, అక్క‌డినుంచి చైనాను నియంత్రించాల‌న్న‌ది రెండ‌వ ల‌క్ష్యం. ఎందుకంటే ప్ర‌స్తుతం బ‌గ్రామ్ విమానాశ్ర‌యాన్ని తాలిబ‌న్లు మ‌న‌దేశానికి అప్ప‌గించారు! ఈ మొత్తం వ్య‌వ‌హారంలో, పాకిస్తాన్ దెబ్బ‌తినే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఒక‌వైపు బలూచ్‌లు మరింత యాక్టివ్ అయ్యారు. మ‌రోవైపు తాలిబ‌న్లు పాకిస్తాన్‌లో డ్రోన్ల దాడుల‌కు దిగుతున్నారు. ఊహించ‌ని ఈ దాడుల‌తో ఆశ్చ‌ర్యపోవ‌డం పాక్ వంతైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *