– 25 శాతం విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్, జూలై 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టు నెగ్గించుకున్నాడు. భారత్‌పై సుంకాల చర్యలకు ఉపక్రమించారు. మన దేశ వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు. భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను, ఇంధనాన్ని భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా జరిమానా కూడా విధిస్తున్నాం. ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని ’ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు. ఇటీవల భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్.. ఆగస్టు 1ని డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి ఏప్రిల్‌లోనే ప్రకటన చేసినప్పటికీ.. చర్చల కోసం వీటి అమలుకు గడువు ఇచ్చారు. ఇక భారత్‌పై సుంకాల విషయంలో ఇటీ-వల స్కాట్లాండ్ పర్యటన సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారత్ సుంకాలు విధిస్తోందని, అలా చేయడం తగదన్నారు.




