– అందుకు బీజేపీపై దాడులు
– బెంగాల్ సభలో ప్రధాని మోదీ
కోల్‌కతా, ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శనివారం ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రస్తుత అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం భయాందోళనలకు గురవుతోందని అన్నారు. ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత కల్పిస్తామని, రాజకీయ హింసలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్బ బర్ధమాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ నుంచి చొరబాటుదారులందరినీ తరిమేస్తాం.. అలాంటి వారికి మద్దతునిచ్చి, వారు ఇక్కడ స్థిరపడటానికి సహాయపడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.. అమాయక ప్రజలపై, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం.. అవినీతి, శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం.. ప్రతీ టీఎంసీ గూండా, సిండికేట్, అవినీతిపరుడైన ఎమ్మెల్యే లేదా మంత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం.. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలను బీజేపీ అడ్డుకోదు.. మేం అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఫూలే జయంతిలో ఆసక్తికర పరిణామం : – రాహుల్‌తో మోదీ సంభాషణ
న్యూదిల్లీ: మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో శనివారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేరణా స్థల్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్దిసేపు సంభాషించుకున్నారు. తొలుత ఈ ప్రధాని అక్కడే ఉన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో బీజేపీ నేత జేపీ నడ్డా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులను పలకరిస్తూ ముందుకు వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న తరుణంలో ప్రధాని, ప్రతిపక్ష నేత పరస్పరం సంభాషించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో పలు పబ్లిక్ స్పీచ్‌లు, రాజకీయ ర్యాలీల్లో మోదీ, రాహుల్ మధ్య విమర్శలు చోటుచేసుకున్నాయి. మోదీ రాజీపడే నేత అని, మన విదేశాంగ విధానం మోదీ పర్సనల్ పాలసీగా మారిందని, ఆయన ఏమి చేయాలో ఏమి చేయకూడదో ట్రంప్ నిర్దేశిస్తున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. రాహుల్ విమర్శలను మోదీ తిప్పికొడుతూ ఆయనొక స్వయం ప్రకటిత రాజకుమారుడని చురకలు అంటించిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




