– తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం
– ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు
నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బావోజీ జాతరకు మాజీ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ లోక్ మసంద్ మహారాజ్ జాతరకు రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతానికి రూ.8 కోట్లతో బ్రిడ్జి వేయించింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఈ దేవాలయ అభివృద్ధికి, గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో చేశారు. మా తండాలో మా రాజ్యం అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. అన్ని రంగాల్లో కేసీఆర్ వారికి రిజర్వేషన్లు తెచ్చారు. గిరిజనులకు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్ ఇచ్చి వారు చేసిందేమీ లేదు. రూ.2,730 కోట్లు ఎస్టీలకు బ్జడెట్‌లో పెట్టి కేవలం రూ.50 కోట్లే ఖర్చు చేశారు. గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహాకాలు ఇస్తామన్నారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యకు దూరం చేస్తున్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఇచ్చిందని హరీశ్‌రావు అన్నారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఎస్టీల ఓట్లు కావాలిగానీ, వాళ్ల సంక్షేమం పట్టించుకోరా అని ప్రశ్నించారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని బడాయి మాటలు చెబుతున్నారని విమర్శించారు. లంబాడీలను దగా చేశారు. సీఎం రేవంత్, ఆయన మనవడు ఫుట్ బాల్ ఆడేందుకు డబ్బులు ఉంటాయి కానీ ఎస్టీలకు ఇచ్చేందుకు లేవా అని ప్రశ్నించారు. లగచర్లలో లంబాడీల భూములు గుంజుకుని సీఎం రేవంత్ రెడ్డి వారిని జైలులో పెట్టారు. ఇక్కడ చేసింది చాలదని కేరళకు పోయి గొప్పలు చెబుతున్నారు. ఇంట్లో ఈగల మోత అంటే కేరళలో పల్లకీ మోత అన్నట్లు ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో రుణ మాఫీ వంద శాతం జరిగిందో రేవంత్ చూపించాలని సవాల్ చేశారు. నేను కొడంగల్ వచ్చినా గ్రామ సభల్లో నాయకులను జనం నిలదీస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలని నిర్లక్ష్యం చేశారు. ప్యాకేజ్-3లో కొంత పని మిగిలి ఉంది. ఆ పని పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని చేయట్లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నిర్లక్ష్యం వల్ల పాలమూరు ప్రజలకు అన్యాయం జరిగిందని హరీశ్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.