నెరవేరబోతున్న గిరిజ‌నుల‌ సొంతింటి కల

– బెండలపాడులో రేపు చారిత్రక ఘట్టం
– రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బెండలపాడు గ్రామంలో బుధవారం జరగబోయే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను గృహ నిర్మాణ శాఖ ఎండీ వి.పి.గౌతమ్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలపాడుకు ముఖ్యమంత్రి రావడం ఒక చారిత్రక ఘట్టం. ఇది గ్రామ ప్రజలకు సంతోషకరమైన, గుర్తుండిపోయే రోజు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. గృహ ప్రవేశ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ పథకం వల్ల జిల్లాలోనే సుమారు 21,500 కుటుంబాల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. గృహప్రవేశాల సందర్భంగా ముఖ్యమంత్రి లబ్ధిదారులతో మాట్లాడి వారి సంతోషంలో పాలుపంచుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మంత్రి తెలిపారు. మంత్రి వెంట టీజీ ఐడిసి చైర్మన్‌ మువ్వ విజయ్‌ బాబు,ట్రైనీ కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *