ఎస్టీల సంక్షేమంలోని లోపాలను సరిచేస్తున్నాం

– గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కల ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం సోమవారం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అడ్లూరు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి సమావేశాన్ని పూర్తిగా విస్మరించగా తమ ప్రభుత్వం వచ్చాక 18 నెలలకే మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్టీల కష్టాసుఖాలు చర్చించడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వం వల్ల గిరిజనుల సంక్షేమ విషయంలో ఎన్నో లోపాలు ఉన్నాయని, వాటిని తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. మీ సలహాలు. సూచనలు ఇవ్వండి.. ముఖ్యమంత్రికి వాటిని నివేదించి న్యాయం చేస్తామన్నారు. గిరిజనుల బడ్జెట్‌ నిధులు వారికే ఖర్చు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేసే పనులకు బిల్లులను సకాలంలో చెల్లిస్తామని, బిల్లుల చెల్లింపుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వమని మంత్రి పేర్కొన్నారు. పనులు చేపట్టడానికి కాంట్రాక్టులు రావడంలేదని ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించవద్దన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించడం వల్ల గర్భిణి ప్రసవవేదన వంటి వార్తలు వస్తున్నాయన్నారు. ఏ ప్రభుత్వమైనా ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించరాదన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియా వెనకబాటులోనే మగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీల్లో ఎక్కువమందికి ఇండ్లు లేవని, వారి ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలనే డిమాండ్‌ ఉందని, సీఎం దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్‌ రామచంద్రనాయక్‌, అదిలాబాద్‌ ఎంపీ గోడెం నగేష్‌, ఆదివాసి గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్య నాయక్‌, స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌, గిరిజన శాఖ కార్యదర్శి శరత్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో చేసిన తీర్మానాలు

సామాజిక అటవీ హక్కులు.. పోడు పట్టాల పంపిణీపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని,
నాయకపోడులను ప్రత్యేక ట్రైబ్‌గా గుర్తించాలని, ప్రత్యేక ఎస్టి కమిషన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజన సొసైటీలకు మరింత లబ్ధి చేకూరేలా సాండ్‌ మైనింగ్‌ విధానంలో మార్పులు చేయాలని, 18 జిల్లాల్లో నూతనంగా జిల్లా ట్రైబల్‌ అధికారి పోస్టుల మంజూరు, మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ఏర్పాటు, ఆశ్రమ పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడేషన్‌, ఆశ్రమ పాఠశాలల్లో 1085 టీచర్‌ పోస్టుల మంజూరు, ఆదివాసీలు పీవీ టీజీల కోసం హైదరాబాదులో ప్రత్యేక ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు ఫిఫ్త్‌ షెడ్యూల్లో వంద శాతం రిజర్వేషన్లు గిరిజనులకు దక్కేలా చర్యలు, అంబేద్కర్‌ విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లను ఏడాదికి ప్రస్తుతం ఇస్తున్న వందమంది విద్యార్థులు నుంచి 500కు పెంచాలని కూడా తీర్మానించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో రాయ్‌ సెంటర్ల నిర్మాణం, గిరిజన దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం వర్తింపు, ఎస్టీలకు మరిన్ని ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై తీర్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *