– ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అవయవ పునరుద్ధరణ కేంద్రాలు
– ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి చికిత్సలకు ప్రోత్సాహం
– కార్పొరేట్ ఆస్పత్రులపై నిరంతర నిఘా
– అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈమేరకు జీవన్‌దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖానల్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిమ్స్, గాంధీ, ఉస్మానియాతోపాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల (అవయవ పునరుద్ధరణ కేంద్రాల) ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. సీనియర్ డాక్టర్లతో అంకిత భావంతదో పనిచేసే బృందాలను ఏర్పాటు చేయాలని, ఒక్కో అవయవానికి ఒక్కో టీమ్ ఉండాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేలా ఈ బృందాలు పనిచేయాలన్నారు. ఇటీవల కేంద్ర చట్టాన్ని అనుసరిస్తున్నందున అందుకనుగుణంగా కొత్త నిబంధనల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులతోపాటు, వారి పెద్దలు కూడా అవయవ దానానికి, స్వీకరించేందుకు అర్హులేనని ఈ నిబంధనను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ చట్టం ప్రకారం ఆర్గాన్ స్వాపింగ్‌కు కూడా అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ ప్రకారం ఇరు రోగుల కుటుంబ సభ్యులు ఒకరికొకరు అవయవాలు దానం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. స్వాపింగ్ విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న నిబంధనలను పరిశీలించి, బాధితులను ఆదుకునే విధంగా నిబంధనలు రూపొందించాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్‌దాన్ కో ఆర్డినేటర్, డాక్టర్ భూషన్‌రాజుకు మంత్రి సూచించారు. దీనికోసం ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు. అవయవ దాతల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.
బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను ఇతరులకు దానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలన్నారు. ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న అవయవ మార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.\
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





