మహిళ సాధికారతకు పెద్ద పీట‌

~ కూకట్‌ప‌ల్లిలో ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 19 : కూకట్‌ప‌ల్లి దుర్గాబాయి మహిళా శిశువికాస  మహిళా ప్రాంగణంలో మహిళా ట్రైనింగ్ సెంటర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉమెన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా సంక్షేమ శాఖ సెక్రటరీ సీతారామచంద్రన్, ఉమెన్ కార్పొరేషన్ ఎండి చంద్రకాంత్ రెడ్డి, అల్విన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లైట్ హౌస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ట్రైనింగ్ సెంటర్‌లో గృహిణుల కోసం కంప్యూటర్ కోర్సులు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కుట్టుమిషన్, ఉపాధి కల్పన తరగతులు వంటి పలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోవో సంస్థ ఆధ్వర్యంలో టు వీలర్, త్రీ వీలర్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రతి మహిళ మహారాణి కావాలంటే ఆర్థిక స్వావలంబన అవసరం. చేతిలో డబ్బు ఉన్నప్పుడే మహిళలకు స్వేచ్ఛ, గౌరవం లభిస్తుంది. కుటుంబాభివృద్ధి, పిల్లలకు మంచి విద్య అందించాలంటే మహిళలు ఆర్థికంగా బలపడాలి” అన్నారు. కూకట్పల్లి మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణతో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల గ్రీన్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన ఆమె, టు వీలర్, త్రీ వీలర్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తయ్యాక వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ సేవల నిర్వహణ వంటి అవకాశాలను కల్పిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐటి కంపెనీల సిఎస్ఆర్ నిధులను మహిళా శిక్షణ కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. అలాగే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే అవకాశాన్ని కూకట్పల్లి మహిళా ప్రాంగణానికి అప్పగిస్తాం” అని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *