– రైలు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న నలుగురు సిబ్బంది
కేసముద్రం, ప్రజాతంత్ర, ఆగస్టు 8: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న బోగీలో గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అందులో నిద్రిస్తున్న రైల్వే ట్రాక్ మిషన్ కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు దూకడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. మూడవ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదే లైన్‌పై ఒక బోగీని నిలిపి ఉంచారు. ఇక్కడ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులంతా ప్రతిరోజూ ఆ బోగీలోనే నిద్రిస్తుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే బోగీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై విచారణ జరుగుతున్నది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే సిబ్బంది తోపాటు పోలీసులు విచారణ చేపట్టారు.



