స్టంట్ ఆర్టిస్ట్ రాజు మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14 : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో గుండెపోటుకు గురై స్టంట్ ఆర్టిస్టు ఎస్‌ఎం రాజు (52) చనిపోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, దర్శకుడు పా రంజిత్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఆదివారం ఉదయం చెన్నై నాగపట్నం సమీపంలో యాక్షన్ సీన్ల చిత్రీకరణ (హైరిస్క్ కారు బోల్తాపడడం) జరిగింది. చిత్రీకరణ అయిపోగానే కారు శిథిలాల్లోంచి రాజును బయటకు తీయగా గాయాలతో ఉన్నట్లు సిబ్బంది కనుగొన్నారు. సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజు మృతిపై హీరో విశాల్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. కారుతో స్టంట్ చేస్తుండగా స్టంట్ ఆర్టిస్టు రాజు చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. నాకు రాజు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడు చాలా ధైర్యం కలిగిన వ్యక్తి అని పోస్టులో పేర్కొన్నారు.





