రామంతాపూర్ లో ఐదుగురు మృతి
శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్ గోఖలే నగర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం ఆగిపోవడంతో యువకులు రథాన్ని లాగుకుంటూ తీసుకెళ్లారు. శోభాయాత్ర ముగింపు దశలో రథానికి విద్యుత్ తీగలు తగలడంతో తొమ్మిది మందికి షాక్ కొట్టి దూరంగా పడిపోయారు. వెంటనే వారిని స్థానిక హాస్పిటల్ తరలించారు. అప్పటికే ఐదుగురు మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు రాజేంద్రరెడ్డి(45), కృష్ణ యాదవ్(21), రుద్రవికాస్(39), శ్రీకాంత్ రెడ్డి(39),సురేశ్ యాదవ్(34)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ హాస్పిటల్ తరలించారు.





