– అత్యవసరంగా స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం
– మెహిదీపట్నం వద్ద స్కై వాక్ ప్రాజెక్ట్
- రాజీవ్ రహదారిలో ఔటర్ వరకు ఆరు లైన్ల విస్తరణ
– లంగర్‌హౌజ్‌లో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం
– రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక భేటీలో పలు ప్రాజెక్టులపై చర్చ
– రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని కోరిన సిఎం రేవంత్
- చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళి
న్యూదిల్లీ,సెప్టెంబర్ 10: దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. కంటోన్మెంట్‌లో రహదారి విస్తరణ, రక్షణశాఖ భూముల బదలాయింపుపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, తెలంగాణలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరం అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ముఖ్యంగా, మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణానికి భూమి అవసరమని, దీనివల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరో ముఖ్యమైన అంశం రాజీవ్ రహదారి విస్తరణను కూడా ప్రస్తావించారు. హైదరాబాద్-కరీంనగర్-రామగుండంలను కలిపే ఈ రహదారిలో, ప్యాకేజీ జంక్షన్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని వివరించారు. వీటితో పాటు, తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.లంగర్‌హౌజ్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సపంలో ‘గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ’ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం నిర్మిస్తామన్నారు. చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాజ్‌నాథ్ సింగ్‌కు సిఎం తెలిపారు. సీఎం వెంట పలువురు తెలంగాణ ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.
చాకలి ఐలమ్మకు నివాళి
అణచివేత, దమనకాండపై చాకలి ఐలమ్మ ధిక్కార పతాకాన్ని ఎగురవేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు అని తెలిపారు. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు గుర్తుచేశారు.