త్వరలోనే టూరిజం కాన్‌క్లేవ్‌

– పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యం
– ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌లో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే అత్యున్నతస్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌-2025 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఇటీవల నూతన పర్యాటక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. పర్యాటకం కేవలం వినోదం కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదని,. వివిధ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకు రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఇది విస్తృతమైన అవకాశాలను కల్పిస్తుందని, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టండి. వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణలోనే త్వరలో ఒక ఉన్నతస్థాయి టూరిజం కాంక్లేవ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం చర్చలకు, పెట్టుబడి ప్రణాళికలకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుందని వెల్లడిరచారు. ప్రపంచస్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వనరులు తెలంగాణలో ఉన్నాయని, అయితే రాష్ట్ర పర్యాటకానికి అనుకున్న స్థాయిలో ప్రచారం లభించకపోవడమే అసలైన లోటని అన్నారు. మీరు మా రాష్ట్రాన్ని అన్వేషించేటప్పుడు మా పర్యాటక అవకాశాలను ప్యాకేజ్‌ చేయటంలో భాగస్వాములు కావాలని, తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలవాలని టూరిజం, ట్రావెల్స్‌, హస్సిటాలిటీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయని, ఈ వేడుకలను చారిత్రక వేయి స్తంబాల గుడి వద్ద ప్రారంభిస్తున్నామని, ఈ పూల పండుగను ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా ఆస్వాదించి, దాని వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి మంత్రి జూపల్లి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *