– వచ్చే ఐదేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
– ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు
– 9రోజుల పాటు 9 వేడుకలు
– 21న వరంగల్ వేయిస్తంభాల గుడివద్ద ఈవెంట్ ప్రారంభం
– విమానాల్లో కూడా ప్రచారం
– మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణను భారతదేశంలో అత్యంత ఇష్టపడే గమ్యస్థానంగా నిలపడమే నూతన పర్యాటక విధాన ప్రధాన లక్ష్యమన్నారు. వచ్చే ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం , కనీసం మూడు లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించడం, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి ఐదు స్థానాల్లో తెలంగాణను నిలపడం , రాష్ట్ర ఆదాయంలో 10 శాతం, అంతకంటే ఎక్కువగా టూరిజం నుంచి వచ్చేలా చూడటం ఈ లక్ష్యాల్లో భాగమన్నారు. తెలంగాణ సంస్కృతి ఈ రెండింటి మేళవింపుగా మిస్ వరల్డ్ ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్రంలో నిర్వహించే పండగల విశిష్టత, మన సంస్కృతి అంతర్జాతీయ పర్యాటకులకూ తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వారిని ఆకర్షించాలనే ప్రత్యేక కార్యచరణతో ముందుకువెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రకృతిని గొప్పగా ఆరాధించే ఉత్సవం బతుకమ్మ.. రకరకాల పూలను ఒక్కచోట అలంకరించి బతుకమ్మగా కొలువడం మన ప్రత్యేకత, పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేకత. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు – ఇది తెలంగాణ ఆత్మ గీతం, మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే, సమాజాన్ని, కుటుంబాలను కలిపే పండుగ ఇదని అన్నారు. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేలా సంబరాలు, ప్రతి తెలంగాణవాసి గుండెల్లో పూల పరిమళంలా నిలిచేలా ఉత్సవం, రియో కార్నివల్ బ్రెజిల్ గర్వంగా నిలిచినట్లే, బతుకమ్మ తెలంగాణ గర్వంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైందన్నారు. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తిని పెంచారని గుర్తుచేశారు. ప్రకృతిని మన సంస్కృతిలో భాగస్వామ్యం చేసుకుంటూ నిర్వహించే ఈ వేడుక ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ బతుకమ్మ పండగ ఎంతో ఖ్యాతి పొందింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించి, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పబోతున్నామన్నారు. బ్రెజిల్లో ఏటా ఘనంగా నిర్వహించే ‘రియో కార్నివాల్’ తరహా కార్యక్రమాలను తెలంగాణలోనూ చేపట్టాలనే ప్రణాళికను రూపొందించామన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పండగను నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఈ పండుగ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 9 రోజుల పాటు 9 వేడుకలు, కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. రియో కార్నివల్ ప్రపంచాన్ని ఆకర్షించినట్లే, బతుకమ్మను కూడా తెలంగాణ సంస్కృతి–సంప్రదాయాల ప్రతీకగా, ప్రపంచ స్థాయి ఉత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రియో కార్నివల్ ఎలా బ్రెజిల్ పర్యాటక రంగానికి గ్లోబల్ ఐడెంటిటీ ఇచ్చిందో, బతుకమ్మ కూడా తెలంగాణ టూరిజానికి అలాంటి బ్రాండ్ ఐడెంటిటీ ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈవెంట్ సెప్టెంబర్ 21న వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుండి 24 వరకు, ప్రతి రోజు 3-4 జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు జరుగుతాయన్నారు. హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తమన్నారు. ఈనెల 27 సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్, సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో పదివేలమంది కంటే ఎక్కువ మంది మహిళల సమూహంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నం, సెప్టెంబర్ 29న పీపుల్స్ ప్లాజా వద్ద బతుకమ్మ పోటీ , సెప్టెంబర్ 29న – ఐటీ రంగం ఉద్యోగులు మరియు ఆర్డబ్ల్యుల పోటీ , సెప్టెంబర్ 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోళి ప్రత్యేక కార్యక్రమాలు, బతుకమ్మ సైకిల్ రైడ్ (సెప్టెంబర్ 28), మహిళల బైకర్స్ రైడ్ (సెప్టెంబర్ 29), విన్టేజ్ కార్ ర్యాలీ (సెప్టెంబర్ 30), సెప్టెంబర్ 25 నుండి 4 రోజుల పాటు మాధాపూర్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్‌తో ఆర్ట్ క్యాంప్, సరస్ బజార్ – పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయంసహాయక సంఘాలతో కార్యక్రమం, బతుకమ్మ ఆకారంలో అలంకరించిన ఫ్లోట్స్ – హుస్సేన్ సాగర్‌లో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో బతుకమ్మ వర్క్‌షాప్‌లు, సెప్టెంబర్ 21 నుండి 30 వరకు బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్, ఢిల్లీ, ముంబై నుండి హైదరాబాద్‌కు వచ్చే అన్ని విమానాలలో ప్రదర్శిస్తారు. రాష్ట్రం బయట నుంచి వచ్చే సందర్శకులు, హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు, సాధారణంగా ఉత్సవాల్లో పాల్గొనని స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రం బయట నుంచి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తారు. ఇండిగో విమానాల్లో ఇన్-ఫ్లైట్ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని టూర్ ఆపరేటర్లు పాల్గొంటారు. స్థానిక ఎఫ్.ఎం. చానెల్స్, ముద్రిత మరియు ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రచారం కొనసాగిస్తామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





