Tourism sector: పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగావకాశాలు

– అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ
– 2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌
– పారిశ్రామికవేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
– మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. అందుకనుగుణంగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుండి రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించిందన్నారు. తద్వారా పర్యాటక రంగంలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని వెల్లడిరచారు. హైదరాబాద్‌ లకడికాపూల్‌ వద్ద సదరన్‌ ట్రావెల్స్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి 17 నుండి అమలులోకి వచ్చిన 2025-2030 పర్యాటక రంగం పాలసీనీ అమలుపరచి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని టాప్‌-5లో ఉంచడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతోపాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ఈ పాలసీలో భాగమన్నారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన పర్యాటక స్థలాల్లో మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం, జలపాతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, వారసత్వంగా గుర్తింపు పొందిన ప్రాంతాలు, ఎకో టూరిజం కేంద్రాలు, వెల్నెస్‌ కేంద్రాలతోపాటు క్రాఫ్ట్‌ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఇవిగాక మరో 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు రూట్‌ మ్యాప్‌ రూపొందించినట్లు మంత్రి ఉత్తవమ్‌ వెల్లడిరచారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తెలంగాణకు తలమానికంగా నిలిచిపోయేలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతోపాటు ప్రాంతీయ రింగ్‌ రోడ్ల వెంట డ్రై పోర్టులు, గోదావరి, కృష్ణా నదులపై రివర్‌ బెస్ట్‌ టూరిజం, నగరాలలో వాటర్‌ఫ్రంట్‌ హబ్‌లు వంటి ప్రత్యేకతలతో కూడిన పర్యాటక కేంద్రాలను రూపొందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దేశీయ, అంతర్జాతీయ ట్రావెల్‌ సంస్థలు కుటుంబ సభ్యులతో నిర్వహించే యాత్రలకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా నిలిచేలా పాలసి రూపొందించామన్నారు. పర్యాటక కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడమేకాక అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను వివరించి ప్రపంచస్థాయిలో నిలబడేలా చేయడం ప్రభుత్వ సంకల్పమని వివరించారు. అందుకు పటిష్టమైన పర్యాటక కార్యవర్గాన్ని నియమించి డెస్టినేషన్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. దేశంలో అత్యంత నమ్మకమైన నెట్‌వర్క్‌ కలిగి ఉండి యాత్రికుల మన్ననలు పొందిన సంస్థగా పేరొందిందన సదరన్‌ ట్రావెల్స్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం శుభపరిణామంగా ఉత్తమ్‌ అభివర్ణించారు. రాష్ట్ర పర్యాటకరంగ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రపతి భవన్‌లో పనిచేస్తున్నపుడు ఈ సంస్థను దగ్గర ఉండి చూశాన్నారు. ఈ సంస్థ హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్‌, రామప్ప, లక్నవరం వంటి పర్యాటక కేంద్రాల ప్రమోషన్‌కు ఉపకరిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *