– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
– పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,జులై 12: తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాదిమంది భక్తులు తరలి వొచ్చే అవకాశంతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటోంది. ఆదివారం మహంకాళి బోనాలకు ఉదయం 4.10 బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. సోమవారం రోజు రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు, ఆదివారంరాత్రి, సోమవారం రాత్రి అమ్మవారి ఫలహర బండ్ల ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి దర్శనం కోసం వొచ్చే భక్తుల కోసం 6 క్యూలైన్ లు ఏర్పాటు చేశారు భక్తులు. బాట షోరూం నుంచి 2 , రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ నుంచి 2, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 క్యూలైన్లు ఉన్నాయి. క్యూ లైన్ లో 16 టర్లకు ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు 70 సీసీటీవి కెమెరాల నడుమ బోనాల జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా మొబైల్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఉదయం వేళల్లో రద్దీ ఉంటుంది కాబట్టి జోగినిలు, శివశక్తులకు దర్శనం చేసుకునేందుకు స్పెషల్ టైం కేటాయించారు. శివ శక్తులు, జోగినిల కోసం మధ్యాహ్నం 2గంటల నుంచి 4 గంటల వరకు సమయం కేటాయించారు.





