– బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు
– మృతులంతా హైదరాబాద్ పాత బస్తీ వాసులు
హైదరాబాద్, నవంబర్ 17: సౌదీ అరేబియాలో జరిగిన విషాద ఘటనలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. ఉమ్రా యాత్రికులతో వెళ్తోన్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) 1.30 గంటల సమయంలో మక్కా నుంచి మదీనా వెళ్తున్న యాత్రికుల బస్సు మదీనా సమీపంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్డడంతో మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌కు చెందిన 45మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం మెహిదీపట్నంలోని ఫ్లైజోన్ ఏజెన్సీ ద్వారా నిర్వాహకులు టికెట్లు బుక్ చేశారు. ఈనెల 9న హైదరాబాద్ నుంచి 54 మంది యాత్రికుల బృందం జెడ్డాకు బయలుదేరింది. 23 వరకు టూర్‌ను ప్లాన్ చేశారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనా బయలుదేరారు. వారిలో నలుగురు ముందుగానే కారులో మదీనాకు వెళ్లగా మరో నలుగురు మక్కాలోనే నిలిచిపోయారు. మిగిలిన 46 మంది బస్సులో ప్రయాణం కొనసాగించారు. మదీనా నుండి సుమారు 25 కి.మీ దూరంలో బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చెలరేగిందని తెలిపారు. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో అబ్దుల్ షోయబ్ (24) అనే యాత్రికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. షోయబ్ డ్రైవర్ పక్కన కూర్చోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం రాలేదు. ప్రమాదంలో షోయబ్ కుటుంబ సభ్యులందరూ చనిపోయినట్టు తెలుస్తోంది. మృతులలో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్
సౌదీ అరేబియాలో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదానికి సంబంధించి న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియాలోని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో ప్రత్యక్షంగా సంప్రదిస్తున్నారు. ప్రమాదం పూర్తి వివరాలను నిర్ధారించడానికి, తెలంగాణ నుండి ఎంతమంది వ్యక్తులు పాల్గొన్నారో నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వందన, పీఎస్ నుండి రెసిడెంట్ కమిషనర్ అండ్ లైజన్ హెడ్: 91 98719 99044
సిహెచ్.చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 91 99583 22143
రక్షిత్ నెయిల్, లైజన్ ఆఫీసర్: 91 96437 23157
భారత కాన్సులేట్ జనరల్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహాకారాలు అందించేందుకు హైదరాబాద్‌లోని సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 91 79979 59754, ?91 99129 19545 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





