మాతృభాషను పరిరక్షించుకునే బాధ్యత ప్రజలదే

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: మాతృభాషను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. భాష జీవిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే సమాజ ఐక్యత బలపడుతుంది అని బీసీ కమిషన్ మాజీ చైౖర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పేర్కొన్నారు. రవీంద్రభారతి మినీ హాల్‌లో భాషా సాంస్కృతిక శాఖ, జాతీయ తెలుగు సారస్వత పరిషత్, ఆదిదీలా ఫౌండేషన్, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభ–కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలకు పునాది అని, భాషను పరిరక్షించడం ద్వారా సమాజ చారిత్రక వారసత్వం భవిష్యత్ తరాలకు అందేలా చేయవచ్చని సూచించారు. కుటుంబ స్థాయిలో మాతృ భాషలో సంభాషణను ప్రోత్సహించడం, పిల్లలకు కథలు, సాహిత్యం పరిచయం చేయడం, స్థానిక సాంస్కృతిక సంపదను అభివృద్ధి చేయడం సమాజ బాధ్యత అని ఆయన వివరించారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అనేక దేశాలు తమ మాతృ భాషను జాతీయ గౌరవంగా భావిస్తూ విద్య, పరిపాలన, సాంకేతిక రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నాయని గుర్తుచేశారు. విశిష్ట అతిథి రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్.బాలాచారి ప్రసంగిస్తూ భాషా అభివృద్ధిలో సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. స్థానిక భాషల్లో రచన, పఠనం, కవితా వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ ద్వారా భాషా చైతన్యం సమాజంలో మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ సభాధ్యక్షునిగా వ్యవహరించగా, డాక్టర్ ఎస్.ఆదినారాయణ సమన్వయకర్తగా, బాదే సాబ్ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాహితీవేత్తలు చెబ్రోలు శశిబాల, కృష్ణ చంద్రవల్లి, ప్రముఖ కవి డాక్టర్ ఆదినారాయణ, ఆదిదీలా ఫౌండేషన్ అధ్య క్షుడు డాక్టర్ ఎ.వి.ఆర్.మూర్తి, జాతీయ తెలుగు సారస్వత పరిషత్ జాయింట్ సెక్రటరీ పాలడుగు సరోజినీదేవి, మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ (విరమణ) గంటి మనోహర్ రెడ్డి, ప్రముఖ కవి రాధాకుసుమ, కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్‌పర్సన్, డాక్టర్ అర్ధ చంద్రప్రకాశ్ రెడ్డి, గోల్కొండ సాహిత్య కళా సమితి అధ్యక్షుడు, లక్ష్యసాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞారావు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గజవెల్లి సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొని కవితలతో సభను తీర్చిదిద్దారు. మాతృభాషా పరిరక్షణ, సాహిత్య సేవ, సామాజిక చైతన్యం, సాంస్కృతిక విస్తరణ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్ చవాకుల సూర్యనరేష్ బాబు, డాక్టర్ పేరుక రాజు, చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, ఎయ్యపు మామిడివల్లి, వనజ బాలసాని, ప్రీతాదాస్, పోలగాని భానుతేజ, రచయిత, కవి గాలిదేవర సత్యనారాయణ, కర్నాటి రఘుబాబు గౌడ్, జనపాల శంకరయ్య, బి.గీత, డాక్టర్ వాసరవేణి పరశురాములు, డాక్టర్ కొలాటి చిన్న పెద్దిరాజు, వేముల వేమన, చరణ్ సాయిదాసు,కవిరత్న డాక్టర్ ఉషారాణి కోగంటి, అంబటి నివాసరావు, వీరబొమ్మ రమేష్, మహేష్ ధీర తదితరులు సత్కారం అందుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *