నలుగురికి ఉద్యోగాలిచ్చేస్థాయికి ఎదగాలి

– సిద్దిపేట యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ మా లక్ష్యం
– పట్టణాన్ని అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాం
– పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని టైలర్, ఆటో డ్రైవర్ పిల్లలు నిరూపించారు
‘హరీష్ అన్న ఉద్యోగ యాప్‌’ ప్రారంభ కార్యక్రమంలో హరీష్‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: హైదరాబాద్ వెళ్లి వేలు ఖర్చుపెట్టే బదులు ఈ యాప్‌ను వాడుకుంటే యువత జీవితాలకు గేమ్ ఛేంజర్ అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట యువత కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌కు ‘హరీష్ అన్న ఉద్యోగ యాప’ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ యాప్ వెతికినా ముందు ఫ్రీ అంటారు.. తర్వాత రూ.500 కట్టమంటారని విద్యార్థులు చెప్పారని, ఈ ఉద్యోగ యాప్‌ను తాము సీరియస్‌గా తీసుకొని ఆత్మవిశ్వాసం పొందుతామని విద్యార్థులు చెప్పిన మాటలు సంతోషాన్ని కలిగించాయని చెప్పారు. ఏ పని చేసినా దాంట్లో మంచి ఫలితాలు వచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ యాప్‌ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చరిత్ర ఉంది.. ఇక్కడ కేసీఆర్ చదువుకున్నారు. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన కాలేజీ ఇది అని పేర్కొన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 95% మంది ఉద్యోగం చేస్తామంటే 5% మంది మాత్రమే వ్యాపారం చేస్తామని చేతులెత్తారు.. అదే గుజరాత్ వంటి రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి 95%మంది ముందుంటారన్నారు. ఉద్యోగం చేస్తాను కాదు.. ఉద్యోగం ఇస్తాననే ఆలోచనతో మీరందరూ ముందుకు వెళ్లాలని హరీష్‌రావు ఆకాంక్షించారు.

సిద్దిపేట అన్ని రంగాల్లో ముందుండాలని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ ఐటిఐ, రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు, రెండు పారా మెడికల్ కాలేజీలు, బీ ఫార్మసీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజీ ఇలా అన్ని విద్యాలయాలు సిద్దిపేటలో ఉన్నాయని తెలిపారు. విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందాం.. ఇంకా అభివృద్ధి చెందుతాం.. . నాట్ ఇన్‌స్టిట్యూట్, సెట్విన్ ఇన్‌స్టిట్యూట్‌ని కూడా సిద్దిపేటలో ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఐటీ టవర్‌ని కూడా తెచ్చి ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఎక్కువమంది యువతులే ఉద్యోగం చేయడం సంతోషం కలిగించిందన్నారు. సిద్దిపేట ఒక ఎడ్యుకేషనల్ హబ్. రిజర్వాయర్లకు కూడా సిద్దిపేటనే హబ్.. ఆలయాలకు కూడా నిలయం.. పెద్ద నగరాలకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు కానీ మన సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది.. సిద్దిపేట అంటే ఒకప్పుడు పందులకు ఫేమస్.. నేడు సిద్ధిపేట అంటే ఒక మోడల్ టౌన్‌గా అభివద్ధి చేశాం అని హరీష్‌రావు వివరించారు. మొబైల్ ఫోన్‌ను సక్రమంగా వాడుకుని పైకి రావాలి అని హితవు చెప్పారు. ఈ ఒక్క సంవత్సరం కష్టపడి చదివి ఉద్యోగం కొడితే మీ జీవితమే మారిపోతుందంటూ సంవత్సరం కష్టపడి జీవితాంతం సుఖపడదామా.. ఇప్పుడు ఎంజాయ్ చేసి జీవితాంతం కష్టపడదామా మీరే నిర్ణయించుకోండి అని అన్నారు. తాను పేదవాడిని.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ప్రపంచంతో పోటీపడు. నీకు నువ్వే పోటీ. సిద్దిపేటలో ఒక టైలర్ రామచంద్రం తన నలుగురు ఆడబిడ్డలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మెడికల్ సీట్ కొట్టి ఈరోజు డాక్టర్ చదువుతున్నారు. ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్న.. మిగతా ఇద్దరిని డాక్టర్ చదివించడానికి శక్తి లేదని రామచంద్ర వచ్చినప్పుడు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత నేను తీసుకున్నాను అని చెప్పారు. కావాల్సిందల్లా పట్టుదల. అది ఉంటే దేనినైనా సాధించవచ్చునన్నారు. జహీరాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకులాలను ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు అందులో ఒక అమ్మాయి డాక్టర్ అవుతానని చెప్పి ఈరోజు డాక్టర్ అయి చూపించింది. జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ కూతురు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించింది అని తెలిపారు. ఎన్నేళ్లు చదివామన్నది కాదు.. సరైన ప్రణాళికతో చదవడమే ముఖ్యం అని చెప్పారు. కొత్త ఆలోచనలతో ముందుకు రండి.. నలుగురికి దారి చూపించండి.. ఈ ఉచిత యాప్‌ని అందరూ సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాలి.. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించాలి అని మనసారా కోరుకుంటున్నానని హరీష్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *