దృష్టి మ‌ళ్లించేందుకే తెర‌పైకి ఫార్ములా కేసు

– సీఎం సంతకం చేసిన తొలి ఫైలు మాయం
– బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇర‌కాటంలో ప్ర‌భుత్వం
– సంస్థ ఖాతాలో భ‌ద్రంగా వున్న మొత్తాన్నివెన‌క్కి తెప్పించ‌వ‌చ్చు క‌దా
– ఫుట్‌బాల్ మ్యాచ్ పేరుతో రూ.100 కోట్లు వృధా
– ప్ర‌ణాళిక లేకుండా మూసీ ప్రాజెక్టుపై ముందుకు
– అసెంబ్లీ సీట్లు పెరిగితే స్వాగ‌తిస్తాం
– టీడీఆర్ పెద్ద స్కాం
– అసెంబ్లీలో చిట్‌చాట్‌లో కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 24:  ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ పై బీఆర్ ఎస్‌ తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు చార్జిషీట్ తెచ్చారని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీలో చిట్ చాట్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ  సీఎం సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ ఎస్‌ బయటపెట్టడంతో  సర్కారు పూర్తిగా ఇరకాటంలో పడింద‌న్నారు. నేను మొదటినుంచి చెబుతూనే ఉన్నా ఇది ముమ్మాటికీ లొట్ట పీసు కేసే. ఇందులో ఏమీ లేదని ప్రభుత్వమే  చార్జిషీట్ లో ఒప్పుకుంది. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన రూ.45 కోట్ల  నిధులు అక్కడి బ్యాంకు అకౌంట్ లో భద్రంగా ఉన్నాయి. తెలంగాణ నుంచి పంపిన నిధులు ఎక్కడా దారి మళ్లలేదు.  ప్రభుత్వం గోరంతలను కొండంతలు చేసే ప్రయత్నం చేస్తున్న‌ద‌ని ఆరోపించారు. ఇక్కడి నుంచి రూ.45 కోట్లు పంపితే రూ.600 – 700 కోట్లని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న‌ద‌ని ఆరోపించారు. ఇలాంటి అభూత కల్పనలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మబోర‌న్నారు. అసలు ఈ కేసులో ఎవరికి అనుచిత లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ఆరోపిస్తుందో వారి పేరే చార్జి షీట్ లో లేదు. సంస్థ ఖాతాలో  భద్రంగా ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తెప్పించవచ్చు కదా. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రతిష్టాత్మక రేసును నగరానికి తీసుకు వచ్చాం. ఈ రేసు వల్ల ఆ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ. 700 కోట్ల ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టం చేసింది. అందాల పోటీలు పెట్టడం వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం జరగలేదు. పైగా అంతర్జాతీయంగా తెలంగాణ అప్రతిష్ట పాలైంది.
తనను లైంగికంగా వేధించారని మిస్ యుకె చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు పోయింది. అంత దారుణం జరిగినా ప్రభుత్వం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయలేదు. సీఎం సరదా కోసం.. ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు వృధా చేసింది. సింగరేణి సంస్థ నుంచి రూ.10 కోట్లు దుర్వినియోగం చేసింది. ఈ రెండు వ్యవహారాల్లో ఎవరిపైన కూడా ఎలాంటి కేసు పెట్టలేదు.ఎలాంటి తప్పు జరగని ఫార్ములా రేసు కేసు కోర్టులో నిలబడదు. ఇదంతా దృష్టి మళ్లించడానికి మళ్లీ రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలకు అర్థమైపోయింద‌న్నారు. మాకు న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉంది. తప్పకుండా ఫార్ములా ఈ రేసులో న్యాయం గెలుస్తుంద‌న్నారు. నాపై రాజకీయ కక్ష తో అధికారులను వేధించడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్ కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పించే అంశాన్ని వదిలిపెట్టండి.

మూసీ ప్రాజెక్ట్ పై విమ‌ర్శ‌లు

కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధి పైన ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు, ప్రణాళిక లేదు. కేవలం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాళ్ళు పైసలు ఇస్తారని, ఇప్పటివరకే ఇవ్వలేదు. వాళ్లకు అవసరమైన స‌వివ‌ర‌ ప్లానింగ్ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. అందుకే మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మా పార్టీ లైన్, అభిప్రాయాన్ని మొన్న గండిపేటలో జరిగిన పబ్లిక్ పాయింట్ పీపీటీ   ప్రెజెంటేషన్ లోనే సమగ్రంగా చెప్పాం. మళ్ళీ కావాలంటే మా పార్టీ తరపున ఆ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రెజెంటేషన్ ను తిరిగి మరొక్కసారి మంత్రులకు కూడా ఇస్తాం, మాకు ఇబ్బంది ఏమీ లేదన్నారు. కానీ మంత్రులు, ప్రభుత్వం చేయాల్సిన చర్చలు ఫైవ్ స్టార్ హోటల్ లోనో, సెక్రటేరియట్ లో పదిమంది అధికారుల మధ్యనో కాకుండా మూసీ బాధితులతో జరగాలి. లక్షలాది మంది మూసీ బాధితులు భయకంపితు లైన ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలి. ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. మేధా పాట్కర్ లాంటి మేధావులు సైతం, గంటా చక్రపాణి లాంటి వారు కూడా ఈ మూసీ ప్రాజెక్టు ప్రజల అభిష్టం మేరకు జరగాలని కోరుతున్నారు.

డీలిమిటేషన్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం జ‌ర‌గాలి

డీలిమిటేషన్ అనేది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాలి. అయితే ఇప్పుడు జరిగినా స్వాగతిస్తాం. 12 ఏళ్ళ కింద జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైనా సంతోషమే. అయితే జనాభా ప్రాతిపదికన గనుక ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఆ రోజైనా, ఈ రోజైనా చెప్పేది ఒక్కటే – పాపులేషన్ ప్రాతిపదికన కాకుండా గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో, అదే విధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుంది.  దక్షిణ భారతదేశం అంతా కలిసి దేశంలోని 24 శాతం రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో ఉంది. దానికి నష్టం రాకుండా కొనసాగించాలని కోరుతున్నాం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు కూడా పెంచుతామంటున్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నామ‌న్నారు. అసెంబ్లీ సీట్లు పెంచితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. అశ్వారావుపేట లాంటి దగ్గర లక్షా ముప్పై వేల ఓట్లే ఉంటే, శేరిలింగంపల్లి దగ్గర తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇంత భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఎకనామిక్ ఇండికేటర్స్ లో అగ్రభాగాన ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఆనాడు చెప్పిన కుటుంబ నియంత్రణ పాటించాయి కాబట్టి, దక్షిణ భారతదేశానికి, దక్షిణ భారత రాష్ట్రాలకి నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తామ‌న్నారు.

రాష్ట్రంలో టిడిఆర్ పెద్ద‌ స్కామ్

టీడీఆర్‌ అనేది అతి పెద్ద కుంభకోణం. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి అనుచరులు టీడీఆర్‌ ని అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీ స్కామ్ కి తెరలేపబోతున్నారని సంవత్సరంన్నర క్రితమే నేను స్పష్టంగా చెప్పా. గత సంవత్సరం బడ్జెట్ సెషన్ లో కూడా టీడీఆర్‌ లు కొంటున్నారు, ఆ తర్వాత టీడీఆర్‌ లను ఖచ్చితంగా వాడాలి అనే నిబంధనలు తీసుకువస్తారు అనే మాటను స్పష్టంగా చెప్పాను. కరెక్ట్ గా అదే విధంగా ఇప్పుడు బలవంతంగా టీడీఆర్‌ లు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది ఖచ్చితంగా భారీ కుంభకోణం. మా ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఈ టీడీఆర్‌ కుంభకోణం పైన సమగ్ర విచారణ చేపిస్తాం. ఈ టీడీఆర్‌ ద్వారా నిర్వాసితుల దగ్గర నుంచి అతి తక్కువకు కొనుగోలు చేసి అడ్డగోలుగా టీడీఆర్‌ అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకి ఖచ్చితంగా వారి పాత్రను బయటపెడతామ‌న్నారు. మొత్తం ఈ టీడీఆర్ లో ఎవరు అమ్మారు, ఎవరు కొంటున్నారు, ఎవరు ఎవరికి మళ్ళీ అమ్ముతున్నారు అన్న ప్రతి వివరాలు తెలిసిపోతాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్కామ్ కి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో టీడీఆర్ అంటే “తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్” అయిపోయాయి. ఎవరెవరి చేతుల్లో ఏ విధంగా టీడీఆర్‌ లు మారుతున్నాయి, ఎందుకు మారుతున్నాయి అన్న ప్రతి అంశం మాకు తెలుసు. రేవంత్ రెడ్డి ఈ టీడీఆర్‌ ను తన కుటుంబానికి ఒక ఏటీఎం లా మార్చుకున్నారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి ఈ టీడీఆర్‌ స్కామ్ ని పూర్తిగా బయటపెడతామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *