– సోనియా, రాహుల్‌లపై ‘నేషనల్ హెరాల్డ్’ కేసులు
– టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– మనం చేసింది ప్రచారం చేసుకోవాలి
– పార్టీ అధ్యక్షులు, నాయకులకు దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంతో దానినుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై మళ్లీ కేసుల పేరుతో కేంద్రంలోని బీజేపీ పాలకులు హడావుడి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం మంగళవారం జరగగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సోనియా, రాహుల్ గాంధీలపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నామని, వారికి అండగా నిలబడతామని, అవసరమైతే ఎందాకైనా పోరాడతామనే సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వదలచుకున్నామని హెచ్చరించారు. నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభించి దేశ స్వాతంత్య్రంలో గాంధీ కుటుంబం కీలక పాత్ర పోషించిందని, ఆ సంస్థ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా నిలబడేందుకు సోనియా, రాహుల్ కృషి చేశారని తెలిపారు. పత్రికను పునరుద్ధరించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అవసరమైనారు కనుకే మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులను డైరెక్టర్లుగా నియమించారని, ఇందులో ఏ ఒక్క రూపాయితో ప్రభుత్వానికి సంబంధం లేదని వివరించారు. దీనిపై మనీ ల్యాండరింగ్ కేసు పెట్టి వారిని వేధిస్తున్నారని ఆరోపించారు.
సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
కాగా, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మనం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని నాయకులకు పిలుపునిచ్చారు. కోటి మంది ఆడబిడ్డలకు కోటి ఇందిరమ్మ చీరలను సారెగా అందిస్తున్నామని, ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదేనంటూ గ్రామలవారీగా సమన్వయం చేసుకుంటూ పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పరిపాలనపై గ్రామగ్రామాన చర్చ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. సంక్షోభంలో మనకు రాష్ట్రాన్ని అప్పగిస్తే సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ముందుకు నడిపిస్తున్నామని, 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నామని, 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నామని చెప్పారు. కోర్ అర్బన్‌లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ‘క్యూర్’ చేయాలని నిర్ణయించుకున్నామని, కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలిస్తామని, రీజనల్ రింగ్ లోపల ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్) ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నామని, రీజనల్ రింగ్ రోడ్ బయట రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ (రేర్) ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మరో నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నామని, కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్-బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతోపాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామని చెప్పారు. పనులు చేయడమే కాదు.. రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో కాళ్లలో కట్టెలు పెట్టడం సహజం.. అది పెద్ద సమస్యగా భావించొద్దు.. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అని ఉద్బోధించారు. సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతన డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





