సంపద సృష్టించి ప్రజలకు పంచడమే లక్ష్యం

– 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు
– కేవలం రైతు పథకాల కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చు
– మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల మంజూరు,
– ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీకి రూ.7వేల కోట్ల చెల్లింపు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 21 : వనరులు, సంపద సమానంగా పంచుతూ ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలన్న ఆకాంక్షతో సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దేశక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకే అంకితం.. ఇంకొకరికి వీసమెత్తు కూడా అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. గత పాలకులు పాలన అంటే దోచుకోవడం.. పంచుకోవడం అన్నట్టు చేశారు.. కానీ పాలన అంటే మా దృష్టిలో సంపద పోగు చేసి ప్రజలకు పంచడమే అన్నారు. వ్యవసాయం దండగ అంటే కాదు మేం పండగ అని రైతు భరోసా, రైతు బీమా, రైతులకు యంత్ర పరికరాల పంపిణీ, డ్రిప్ ఇరిగేషన్, రైతు రుణమాఫీ, సన్న ధాన్యానికి 500 బోనస్ ఇలా కేవలం రైతుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం లక్ష కోట్ల ఖర్చు చేసిందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదన్నారు. ఇప్ప టివరకు సంక్షేమ హాస్టల్ అంటే ఎస్టి హాస్టల్ ఓవైపు, బీసీ హాస్టల్ మరోవైపు, ఎస్సీ హాస్టల్ మరెక్కడు.. సమాజాన్ని ముక్కలుచెక్కలు చేసినట్లుగా విద్యార్థులను విడదీశారని తెలిపారు. సమాజం అంతా ఉమ్మడి కుటుంబంలో ఉండాలి.. కలిసి ఎదగాలన్న భావన చిన్ననాటి నుండి విద్యార్థుల్లో రావాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించి అన్ని వర్గాలకు ఒకే దగ్గర తరతర భేదాలు లేకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నదని తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలాంటి వసతులు, సదుపాయాలు ఉంటాయో అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నిర్మిస్తున్నామని, ఎంతటి ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడబోదని తెలిపారు.   మన బిడ్డలు ఈ పాఠశాలల్లో చదివి ఐఏఎస్ అధికారులుగా, బడా కంపెనీల సీఈవోలుగా ఎదిగి అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారని ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.

పేదవాడు ఆత్మగౌరవంతో బతకడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాయి ఆ తర్వాత వచ్చిన వారు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని తెలిపారు. అధికారంలో 10 సంవత్సరాలు ఉన్న ఒక్క డబుల్ బెడ్ రూమ్ పేదలకు  పంచ‌లేద‌ని తెలిపారు. మొదటి దశలో రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశాం.. ఇందులో కొన్ని గృహ ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి అన్నారు. ప్రతి వారం ఇందిరమ్మ ఇంటి బిల్లులను చెల్లిస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉన్న అనుబంధం అన్నారు. గత పదేళ్లు మహిళలకు ఇచ్చిన చీరలు ఏ విధంగా ఉండేవో వాటిని ఏం చేసేవారు మీకు తెలుసు కానీ మా ప్రభుత్వం అర్హులైన అందరికీ ఖరీదైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నా మని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారంలోకి రాగానే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం ఇప్పటికే మహిళల పక్షాన ఆర్థిక శాఖ ఆర్టీసీకి 7వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిదెందుకు ఏటా 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తాం అని చెప్పి 26 వేల కోట్లు చెల్లించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిది అన్నారు. ఉద్యోగ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం, గత ప్రభుత్వం 20వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది కానీ వారు వెళ్లిపోతూ అప్పులు అప్పగించినా మేము ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెనా మొదటి తేదీన గత రెండు సంవత్సరాలుగా వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో 68,547 గృహ వినియోగదారులు ఉండగా 47.814 మంది వినియోగదారులకు 200 యూనిట్ల గృహ జ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.11 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా గృహ జ్యోతి పథకం కింద 52.087 లక్షల మందికి ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. 263 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ధర్మపురిలో బుధ వారం శంకుస్థాపన చేసుకున్నామని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కోరిన విధంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *