అధికారులకు మంత్రి దామోదర దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటళ్లకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు కొనుగోలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వినియోగిస్తున్న యంత్రాలు, పరికరాలు ఏంటో అక్కడి వైద్యులను అడిగి తెలుసుకోవాలంటూ కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్ కొనుగోళ్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కొత్త హాస్పిటళ్లకు పేషెంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, ఆ అంచనాలకు తగ్గట్టు ఫర్నిచర్, ఎక్విప్‌మెంట్ సరిపడా ఉండాలని, డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెటుకోవాలని చెప్పారు. కొనే ప్రతి వస్తువుకూ వారంటీ ఉండాలని, నిర్వహణ విషయంలో సరఫరాదారులను బాధ్యులుగా చేయాలని, ఒక్క వస్తువు కూడా మరమ్మతులో లేదా నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ దవాఖాన్లలో మందుల సరఫరాపై వివిధ విభాగాల హెచ్‌వోడీలను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా? లేవా అని డీఎంఈ, వీవీపీ కమిషనర్, డీహెచ్‌ను ప్రశ్నించారు. ్ణసీజనల్ వ్యాధుల కాలం అయినందున రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకనుగుణంగా సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్‌లో ఉన్న ప్లేట్‌లెట్ సెపరేషన్ మిషన్లు వర్కింగ్ కండీషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీ డయాగ్నస్టిక్స్ హబ్స్‌లో అన్నిరకాల టెస్టులు, స్కాన్లు చేయాలన్నారు. ఒక్క టెస్టు కోసం కూడా పేషెంట్‌ను బయటకు పంపించొద్దన్నారు. ప్రతి పీహెచ్‌సీలోనూ టెస్టులు అవసరమైన పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించాలని, 24 గంటల లోపల రిపోర్టులు అందజేయాలని మంత్రి ఆదేశించారు. గతేడాది కొత్తగా ప్రతి జిల్లాలోనూ మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, ఆయా స్టోర్లకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించామంటూ అన్ని జిల్లాల్లో భవనాల నిర్మాణాన్ని ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మెడికల్ కాలేజీలన్నింటిలోనూ సీటీ స్కాన్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, అలాగే అవసరమైనచోట ఎంఆర్‌ఐ యంత్రాల ఏర్పాటుకు నిధులు కేటాయించామని తెలిపారు. ఎంఆర్‌ఐ మిషన్ల కొనుగోలు, ఏర్పాటు పక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.





