అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

– ఇక్క‌డ‌ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన
– రూ.1238 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాం
– ప్రజలే కేంద్రంగా మా పాలన
– ప్రజల ఆలోచనే మా విధానం
– పిప్రి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి

ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈ రాష్ట్రంలో పుట్టడం పెరగడం మా అదృష్టం అని ప్రజలు అనుకునే రీతిలో పాలన చేస్తున్నామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నికల ముందు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సంబధించి సోమవారం జిల్లాలో పలు పనులకు శంకుస్థాపనులు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం పిప్రిలో జరిగిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇక్కడ బహిరంగ ఏర్పాటు నా ఆలోచన కాదు.. ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు. ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో మనది ప్రజల ప్రభుత్వం.. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దాం.. పిప్రి నుంచి ఖమ్మం వరకు మీరు నడుస్తూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంటారు.. వారు చెప్పిన అనేక సమస్యలు విని ఉంటారు.. వాటికి సంబంధించిన పనులను వెంటనే మంజూరు చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ హామీలన్నీ అమలు చేసి నిజం చేద్దాం.. అదే నిజమైన ప్రజా పాలన’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. ఆనాడు మండుటెండల్లో నాతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారు.. ఈరోజు రూ.1238 కోట్ల విలువైన పనులు అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని భట్టి విక్రమార్క చెబుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు  తెలిపారు. ఇది ఒక రాజకీయ సభ కాదు.. ఆనాడు తాను ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ఈ సభ అని పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు అనేక హామీలు ఇస్తాయి.. కానీ అధికారంలోకి రాగానే మర్చిపోతాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ తాము పాలకులం కాదు సేవకులం అనే భావనతో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. అధికారం అంటే హోదా అని అధికారం అంటే పెత్తనం చేయడమే అనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి గాని, డిప్యూటీ సీఎంగా నాకు కానీ, తమ కేబినెట్ సభ్యులకు గానీ లేదు అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే 99% హామీలు అమలు చేసిన గొప్ప ప్రభుత్వం తమది అని¾ చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఇల్లు లేదని, పదేళ్లుగా ఇల్లు కోసం గోడు వెళ్ళబోసుకుంటున్నామని అనేకమంది ఎన్నికల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.. ఓవైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను పాదయాత్ర చేశాము. ఆనాడు మాతో గోడు వెళ్ళబోసుకున్న ఆడబిడ్డల మాటలను దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం.. నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించి చిత్తశుద్ధిని చాటుకున్న ప్రభుత్వం తమది అని డిప్యూటీ సీఎం తెలిపారు. తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. నిన్న కూడా ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు.

ప్రపంచంతో మన బిడ్డలు పోటీపడేలా యంగ్ ఇండియా స్కూల్స్

రాష్ట్ర ప్రభుత్వానికి మానవీయ కోణం ఉంది. అంతరాలు లేని సమాజం నిర్మించాలన్న ఆలోచనతో ప్రపంచంతో మన బిడ్డలు పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేశారు. ఒక్కో పాఠశాలను రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ తరహా పాఠశాలలు లేవంటూ అన్ని వర్గాల పిల్లలను ఒకే దగ్గర చదివిస్తూ వసుదైక కుటుంబంగా రాష్ట్రం ఎదగాలన్నదే సీఎం ఆలోచన అని అన్నారు. ఈరోజు ఒక్కరోజే మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాదు కొత్తగా అనేక పథకాలు అమలు చేస్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేసి మీ రాష్ట్రంలో ఇన్ని పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోతూ అడుగుతున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటి పెద్దకు అనుకోని ప్రమాదం జరిగితే భరోసాగా నిలవాలన్న ఆలోచనతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో బిడ్డలు పాఠశాలకు వెళ్లాలంటే అర్ధాకలితో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు తలకెక్కని పరిస్థితి.. అందుకని రాష్ట్రంలోని ఏ బిడ్డా ఆకలితో బడికి వెళ్ళవద్దని భావించిన సీఎం ప్రతి బిడ్డకు బడికి రాగానే ఉదయం అల్పాహారంతోపాటు రాగి జావ లేదంటే పాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని తన కుటుంబాన్ని కాదు రాష్ట్రాన్ని పైకి తెస్తారని విద్య కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎంతో దూరం నుంచి ఎండలో పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా తాను. కేబినెట్ సహచరులం అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం.. పేదలు, రైతుల పరిస్థితి తెలిసిన వాళ్లం అని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగాలి.. ప్రజల ఆలోచన మా విధానం.. ప్రజల ఆలోచన మా ఎజెండా అని చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో రాష్ట్రం పోటీ పడాలనేదే తమ కేబినెట్ ఆలోచన.. మాకు వ్యక్తిగత అజెండాలు లేవు అని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రం బాగుపడాలి.. మహిళలు, పేదలు బాగుపడాలి.. కోరి తెచ్చుకున్న తెలంగాణను ప్రజలే పాలించాలి.. ఫ్యూడల్స్ ద్వారా కాదు అని స్పష్టం చేశారు. అలాంటి ఈ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ప్రజలకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. పైసా పైసా పోగు చేస్తాం.. ప్రజలకే పంచుతాం అన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం అన్నారు. ఈ సదర్భంగా సీఎం కప్ రెండో ఎడిషన్‌లో వివిధ క్రీడలలో ఆదిలాబాద్ జిల్లా 32 పతŠకాలను సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో క్రీడాకారులకు సీఎం రేవంత్‌రెడ్డి ట్రోఫీని అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *