శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాటి సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారన్నారు. తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారని, ఆ తర్వాత భక్తులకు దర్శనం కల్పించినట్లు శ్యామలరావు తెలిపారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్‌ రెడ్డి, నరేష్‌ కుమార్‌, శాంతారామ్‌, సదా శివరావు, జంగా కృష్ణమూర్తి, జానకిదేవి, మహేందర్‌ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *