తిరుమల, ప్రజాతంత్ర, జులై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించగా మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులకి అలంకరించారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు తలకు శ్రీవారి పాద వస్త్రంతో ’పరివట్టం’(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. తరువాత అర్చకులు పెద్ద జీయర్, చిన్న జీయర్ లకు టీటీడీ తరఫున ఈవోకి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. ’రూపాయి’ హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది. సాయంత్రం పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారామ్, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, జానకిదేవి, మహేందర్‌రెడ్డి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ఆణివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కన గల తిరుమల పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు, తమిళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీధరన్ కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ అదనపు కార్యదర్శి మణివాసగం, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శివరామ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు సుందర బట్టర్ తదితరులు పాల్గొన్నారు.





