– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ కొద్ది రోజులుగా అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేయాలని రవాణా శాఖ ఉన్నతస్థాయి అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రవాణా శాఖ ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. ఇందుకోసం ఎన్‌ఫోర్సుమెంట్ పనితనాన్ని వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లాస్థాయి బృందాలు, మూడు రాష్ట్రస్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏ బృందం ఎక్కడ తనిఖీలు చేపడుతుంది అనే దానిపై ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు మాత్రమే ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టింది. గత పది రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4,748 కేసులు ఎన్‌ఫోర్సుమెంట్ నమోదు చేసింది. 3,420 వాహనాలను సీజ్ చేశారు. ఎన్‌ఫోర్సుమెంట్ బృందాలు తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దాని మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతోపాటు, రెండోసారి ఓవర్ లోడ్‌తో పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతోపాటు, వాహనం నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఓవర్ లోడ్‌పై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో అక్కడే నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెవీ వెహికల్ డ్రైవరుకు లైసెన్సు రెన్యువల్ సమయంలో పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్న సమాచారాన్ని ప్రజల నుండి సమాచారం వచ్చిన వెంటనే రవాణా శాఖ అధికారులు స్పందించాలని ఆదేశించారు. గత ఏడాది నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ సారి జనవరిలో జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసులు, అధికారుల భాగస్వామ్యం ఉండేలా ఇప్పటినుండి అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల నుండి కాలేజీ వరకు వ్యాసరచన పోటీలు, రోడ్డు నిబంధనలపై నాటకాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చేసి ప్రమాదాలు తగ్గించి మరణాల రేటు నివారించేలా కార్యాచరణ చేపట్టాలని రవాణ ాశాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఖాళీల భర్తీతోపాటు పదోన్నతులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పది రోజులకొకసారి ఎన్‌ఫోర్సుమెంట్‌పై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్యలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





